ఉదయం కార్పెంటర్‌ షాపులో పని.. రాత్రయితే బస్తీల్లో..

23 Jul, 2022 21:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ద్విచక్ర వాహనాలపై నగరంలో చక్కర్లు కొట్టాలనే ఉద్దేశంతో వాటి చోరీలు మొదలెట్టిన ఓ బాలుడు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. ఇతడి నుంచి ఈ దొంగ వాహనాలు ఖరీదు చేస్తున్న ముగ్గురు రిసీవర్లను పట్టుకున్నట్లు డీసీపీ డి.సునీత రెడ్డి శుక్రవారం వెల్లడించారు. జిర్రా ప్రాంతానికి చెందిన ఓ బాలుడు (15) స్కూలు స్థాయిలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. అప్పటి నుంచి ఓ కార్పెంటర్‌ షాపులో పని చేస్తున్నాడు. ద్విచక్ర వాహనాలపై సిటీలో తిరగాలన్నది అతడి కోరిక. అయితే బైక్స్‌ ఖరీదు చేయడానికి స్తోమత లేకపోవడంతో వాటిని చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు.

గోల్కొండ, హుమాయున్‌నగర్, బంజారాహిల్స్, లంగర్‌హౌస్, ఆసిఫ్‌నగర్‌ల్లోని బస్తీల్లో రాత్రి వేళల్లో సంచరించే వాడు. గల్లీల్లో పార్క్‌ చేసిన వాహనాల్లో హ్యాండిల్‌ లాక్‌ వేయని వాటిని గుర్తించేవాడు. అదును చూసుకుని వాటిని తస్కరించే బాలుడు తోసుకుంటూ కొద్దిదూరం వెళ్లేవాడు. ఆపై వైర్లు కలపడం ద్వారా వాటిని స్టార్ట్‌ చేసుకుని ఉడాయించే వాడు. ఆ వాహనంపై మోజు తీరే వరకు దానిపై చక్కర్లు కొట్టే వాడు.

ఆపై ఎలాంటి పత్రాలు లేని వాటిని ఒక్కోటి రూ.10 వేల చొప్పున తన ప్రాంతంలోనే నివసించే సయ్యద్‌ నబీ, అబ్దుల్‌ అల్తాఫ్, మహ్మద్‌ ఫెరోజ్‌లకు విక్రయించాడు. ఇలా ఇప్పటి వరకు ఎనిమిది వాహనాలను బాలుడు తస్కరించాడు. దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, కె.నర్సింములు, షేక్‌ బుర్హాన్, కె.శీనయ్య వలపన్ని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ వాహనాలు ఖరీదు చేసిన ముగ్గురినీ అరెస్టు చేసి ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని గోల్కొండ పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు