Rahul Dravid Angry Reaction: కూల్‌గా కనిపించే ద్రవిడ్‌లో ఇంత కోపమా..

23 Jul, 2022 21:48 IST|Sakshi

టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎంత కూల్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా దిగ్గజ బ్యాటర్‌గా పేరు పొందిన ద్రవిడ్‌ తాను ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ప్రశాంతగానే కనిపించేవాడు. ఓపికకు మారుపేరుగా నిలిచే ద్రవిడ్‌కు 'ది వాల్‌' అన్న పేరు  సార్థకం చేసుకున్నాడు. అయితే తాజాగా ద్రవిడ్‌ కోపాన్ని ప్రదర్శించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన శుక్రవారం విండీస్‌, టీమిండియా మధ్య జరిగిన తొలి వన్డేలో చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో వెస్టిండీస్‌ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. సిరాజ్‌ ఆఖరి ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. ఈ సమయంలో స్టాండ్స్‌లో కూర్చున్న ద్రవిడ్‌ ఫీల్డ్‌ ప్లేస్‌మెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పక్కన కూర్చున్న బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌తో అరె ఏం ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు అంటూ కోపంగా అనడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్‌ చేస్తూ ''యాక్షన్‌, ఎమోషన్స్‌ మన చేతుల్లో ఉండవు అనడానికి ఇదే నిదర్శనం'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. మొత్తానికి ఎప్పుడూ కూల్‌గా కనిపించే ద్రవిడ్‌లో ఇంత కోపమా అంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. ఇక ఆఖరి ఓవర్లో ఐదు యార్కర్స్‌ వేసిన సిరాజ్‌ 11 పరుగులు మాత్రమే ఇవ్వడంతో టీమిండియా బతికిపోయింది.

టీమిండియా, వెస్టిండీస్‌తో మధ్య జరిగిన తొలి వన్డే ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో టీమిండియా 3 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ ఓడినా వెస్టిండీస్‌ బ్యాటర్లు పోరాడిన తీరు అందరిని ఆకట్టుకుంది.  టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (99 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మూడు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోగా... శుబ్‌మన్‌ గిల్‌ (53 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (57 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. 309 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్‌ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టులో కైలే మేయర్స్‌ 75 పరుగులు, బ్రాండన్‌ కింగ్‌ 54 పరుగులతో రాణించారు. మ్యాచ్‌ చివర్లో అకేల్ హోసేన్ 33, రొమారియో షెపర్డ్ 39 నాటౌట్‌ కంగారు పెట్టించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.

చదవండి: Sam Northeast: 410 పరుగులు నాటౌట్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో కొత్త చరిత్ర

Vince Mcmahon: WWEకి విన్స్‌ మెక్‌మ్యాన్‌ రిటైర్మెంట్‌

మరిన్ని వార్తలు