రూ. కోట్లకొద్దీ డబ్బు, బంగారం స్వాధీనం 

10 Oct, 2023 05:57 IST|Sakshi
చైతన్యపురి పరిధిలో స్వాధీనం చేసుకున్న నగదు

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలుతో పోలీసుల విస్తృత తనిఖీలు 

ఎలాంటి ఆధారాల్లేకుండా తరలిస్తున్న డబ్బు, బంగారం సీజ్‌

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌ సహా జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. వాటిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

రాజధాని పరిధిలో... 

  • బషీర్‌బాగ్‌ నిజాం కళాశాల వద్ద వాహన తనిఖీ ల్లో ఓ బంగారం దుకాణానికి చెందిన, ఎలాంటి పత్రాల్లేని 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.5 కోట్లు ఉండొచ్చని చెప్పారు. పురానాపూల్‌ వద్ద బేగంబజార్‌కు చెందిన ఒకరి నుంచి రూ.15 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. 
  • హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.25 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో షాద్‌నగర్‌కు చెందిన స్క్రాప్‌ వ్యాపారి సంతోష్‌ చంద్రశేఖర్‌ (48) నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 
  • రంగారెడ్డి జిల్లా లాల్‌పహాడ్‌ చౌరస్తా వద్ద తనిఖీల్లో 2 కిలోల బంగారం, రూ. 1.22 లక్షలు పట్టుబడ్డాయి. 
  • ఆగాపురా హమీద్‌ కేఫ్‌ చౌరస్తాలో షాహీన్‌ నగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ నుంచి రూ. 5 లక్షలు, బేగంబజార్‌కు చెందిన దినేష్‌ ప్రజాపతి నుంచి రూ.12 లక్షల నగదు స్వాదీనం. 
  •  షేక్‌పేట నారాయణమ్మ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలు సీజ్‌. 
  • వనస్థలిపురం పరిధిలో ఓ కారులో సంరెడ్డి భరత్‌రెడ్డి తీసుకెళ్తున్న రూ. 5.16 లక్షలు స్వాధీనం. 
  • గోపాలపురం పీఎస్‌ పరిధిలోని ఓ లాడ్జీలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 4 లక్షలు. 
  •  పంచశీల క్రాస్‌ రోడ్స్‌ వద్ద గోపి అనే వ్యక్తి నుంచి రూ. 9.3 లక్షలు స్వాదీనం. 

వివిధ జిల్లాల్లోనూ... 

  • రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి బీడీఎల్‌ చౌరస్తా వద్ద తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ. 9,38,970తో పాటు గాయత్రి ఆస్పత్రి వద్ద తనిఖీల్లో మరో కారులో తరలిస్తున్న రూ.71,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. అలాగే షాద్‌నగర్‌ టోల్‌ ప్లాజా వద్ద సంగారెడ్డికి చెందిన నగేష్‌ నుంచి రూ.7 లక్షలతోపాటు షాద్‌నగర్‌లోని జీహెచ్‌ఆర్‌ కాలనీకి చెందిన అశోక్‌ బైక్‌పై తీసుకెళ్తున్న రూ. 11.50 లక్షలను సీజ్‌ చేశారు. 
  • నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి వద్ద తనిఖీల్లో నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌కు చెందిన వ్యాపారి కారులో తరలిస్తున్న రూ. 5.40 లక్షల నగదును స్వా«దీనం చేసుకొన్నారు. 
  • ఏపీకి చెందిన వారి నుంచి వైరాలోని చెక్‌పోస్టు వద్ద రూ.5లక్షలు, తల్లాడ సూపర్‌ మార్కెట్‌ యజమాని కొత్తూరి సైదకుమార్‌ రూ. 5 లక్షలను సీజ్‌ చేశారు. మధిర వద్ద తనిఖీల్లో కోనా గోపాలరావు అనే వ్యక్తి నుంచి రూ.12.65 లక్షలను సీజ్‌ చేశారు.
మరిన్ని వార్తలు