మాదక ద్రవ్యాల స్మగ్లర్‌ కిషన్‌ సింగ్‌ భారత్‌కు అప్పగింత  

23 Mar, 2021 16:20 IST|Sakshi
కిషన్‌ సింగ్

లండన్‌: పేరుమోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్‌ కిషన్‌ సింగ్‌ను(38) బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్న కిషన్‌ సింగ్‌ భారత్‌లో వాంటెడ్‌ నేరగాడిగా పోలీసు రికార్డులక్కాడు. లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసు శాఖ అతడిని ఇండియాకు అప్పగించింది. రాజస్తానీ మూలాలున్న కిషన్‌ సింగ్‌ బ్రిటీష్‌ పౌరుడు. 2016–17లో ఇండియాలో మెఫాడ్రోన్‌ (వైట్‌ మ్యాజిక్‌), మ్యావ్‌ మ్యావ్, కెటామైన్‌ అనే మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసినట్లు అతడిపై కేసు నమోదయ్యింది. 2018లో లండన్‌లో అక్కడి పోలీసులు కిషన్‌ సింగ్‌ను అరెస్టు చేశారు.    

ఎవరీ కిషన్‌ సింగ్‌?
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా రేవంత్ గ్రామం కిషన్‌ సింగ్‌ జన్మస్థలం. త్వరగా డబ్బు సంపాదించాలనే కలతో అతడు 2009 లో లండన్ వెళ్లి అక్కడ విండో-తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కిషన్ 2013 లో భారతదేశానికి వచ్చి రాజస్థాన్‌లో వివాహం చేసుకుని మళ్లీ లండన్‌కు వెళ్లాడు. ఆరేళ్లపాటు లండన్‌లో ఉన్న తరువాత కిషన్ సింగ్ 2015 లో యునైటెడ్ కింగ్‌డమ్ పౌరుడు అయ్యాడు. 2016 నుంచి అతడి చీకటి వ్యాపారాలు బట్టబయలయ్యాయి. ముంబైలోని ఏజెంట్ల ద్వారా మహారాష్ట్ర నుంచి మత్తు పదార్థాలను సరఫరా చేసినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. 

ఢిల్లీలోనూ ఏజెంట్లను నియమించుకుని యూఏఈ, యూకే, యూఎస్‌ఏ, మలేసియా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో డ్రగ్స్‌ దందా సాగించినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా 2017, ఫిబ్రవరి 15న ముగ్గురు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 50 కోట్లు విలువ చేసే ‘మ్యావ్‌ మ్యావ్’ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. లండన్‌లో ఉన్న కిషన్‌ సింగ్‌ ఆదేశాలకు అనుగుణంగా తాము డ్రగ్స్‌ సరఫరా చే​స్తున్నామని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు