ఇష్టారాజ్యం!

25 Feb, 2021 09:13 IST|Sakshi

దుర్గగుడిలో కొత్త పోస్టులు సృష్టిస్తున్న అధికారులు

కమీషన్లు దండుకుని కొలువులు

లెక్కా పత్రం లేకుండా వేతనాలు

ఏసీబీ అధికారుల కంట పడకుండా జాగ్రత్తలు

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): నచ్చిన వారికి కొలువులివ్వడం.. వారు అడిగినంత వేతనాలు చెల్లించడం దుర్గగుడి అధికారులకు పరిపాటిగా మారింది. కమిషనర్‌ ఆర్డర్‌తో పని లేదు.. ఆలయంలో ఉద్యోగం చేసే అర్హతలున్నాయా లేదా అనేది అవసరం లేదు.. కావాల్సిందల్లా అధికారుల అండదండలే.. గత కొంత కాలంగా దుర్గగుడిలో  పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ఈ విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు పాటించారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఈ ఉద్యోగులను విధుల్లోకి రానివ్వకుండా చూశారు. ప్రస్తుతం అక్కడి ఉద్యోగుల్లో ఇదీ చర్చనీయాంశం అయ్యింది.

అమ్మవారి పల్లకీసేవ, ఊరేగింపులు, ఉత్సవాల సమయంలో బోయలు సేవలు చేస్తుంటారు. గతంలో దేవస్థానంలో 14 మంది బోయలు విధులు నిర్వహిస్తుండగా, కొత్తగా ఇద్దరు బోయలను విధుల్లోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో భారీగానే సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. కొత్తగా విధుల్లోకి చేరిన బోయలకు కమిషనర్‌ అనుమతి లేదు. రెండు నెలలుగా వారికి వేతనాలు చెల్లించడం లేదు. బోయలకు వేతనాలు చెల్లించాలంటే తొలుత వారి వివరాలను దేవస్థాన పరిపాలనా విభాగం రిజిస్ట్రార్‌లో నమోదు చేసుకోవాలి. తమ వివరాలను నమోదు చేసి వేతనాలు చెల్లించాలంటూ బోయలు రెండు నెలలుగా ఈవో చాంబర్‌కు, పరిపాలనా విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

అమ్మవారి ప్రసాదాలను విక్రయించే కౌంటర్లలో ఇద్దరు సిబ్బందిని దేవస్థాన అధికారులు నియమించారు. గతంలో ఏళ్ల తరబడి విధులు నిర్వహించిన సిబ్బందిని కరోనా సమయంలో ఆలయ అధికారులు తొలగించారు. తొలగించిన వారి స్థానంలో కొత్తగా ఇద్దరిని నియమించడానికి భారీగానే సమర్పించుకున్నట్లు సమాచారం.

దుర్గగుడిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలను కవరేజీ చేసేందుకు ఒక ఫొటోగ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్‌ ఉన్నారు. అయితే నెల రోజుల కిందట మరొకరిని అదనంగా విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడకూ కమిషనర్‌ ఆర్డర్‌ లేదు.

ఇలా అనధికారికంగా విధుల్లోకి తీసుకున్న వారి నుంచి కమీషన్లు దండుకున్న అధికారులు వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బంది కన్న ఎక్కువగా జీతాలు ఇస్తామంటూ నమ్మబలికినట్లు తెలిసింది.

అధికారుల తీరుపై సిబ్బంది ఆగ్రహం 
దుర్గగుడిలో ఎన్నో ఏళ్లుగా 80 మంది ఎన్‌ఎంఆర్‌లు(నాన్‌ మస్టర్‌ రోల్‌)గా, ఇంజినీరింగ్‌ విభాగంలో మరో 18 మంది కాంట్రాక్ట్‌ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అనేక మంది రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. అయితే ఎన్‌ఎంఆర్‌లకు రూ.15 వేల నుంచి రూ.16 వేలు చెల్లిస్తుండగా.. అనధికారికంగా కొత్తగా విధుల్లోకి చేర్చుకున్న వారికి మాత్రం రూ.18 వేలు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి:
13 మంది దుర్గ గుడి ఉద్యోగుల సస్పెన్షన్‌.. 
నేడు కుప్పానికి బాబు: మేము రాలేం బాబోయ్‌!

మరిన్ని వార్తలు