Interim Budget 2024: నేడే బడ్జెట్‌

1 Feb, 2024 02:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమరశంఖం పూరించకముందే ఎన్నికల తాయిలాలతోపాటు సామాన్య ప్రజానీకం ఆశలను సాకారం చేస్తుందని అంతా భావిస్తున్న కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ ఈరోజే పార్లమెంట్‌ ముందుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్‌ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ముందుగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్‌ భవనానికి నిర్మల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది.

బడ్జెట్‌ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్‌ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి ఒకసారి భేటీకానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్‌సభలో అడుగుపెడతారు. బడ్జెట్‌ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులుసహా సమగ్ర బడ్జెట్‌ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు.

లోక్‌సభలో ఆమె బడ్జెట్‌ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరసగా ఆరోసారి. గురువారం నాటి బడ్జెట్‌తో కలుపు కుని ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టినవారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‌ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమంచేయనున్నారు. మన్మోహన్‌ సింగ్, అరుణ్‌ జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌ సిన్హాలు ఐదు సార్లే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  

బడ్జెట్‌ మెరుపులు ఉంటాయా ?
అద్భుత ప్రకటనలు ఆశించవద్దని విత్త మంత్రి విస్పష్టంగా చెప్పారు. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. అయినాసరే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్‌లోనూ కొన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటించే ధోరణి ఏనాడో మొదలైంది. 2004లో ఇదే ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో 50 శాతం డియర్‌నెస్‌ అలవెన్స్‌ను మూలవేతనంతో కలుపుతున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు.

ప్రణబ్‌ ముఖర్జీ, పీయుశ్‌ గోయల్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడూ ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. అందుకే ఈసారీ బడ్జెట్‌ ఊరటలు ఉంటాయని జనం గట్టిగా నమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్‌పై సుంకం తగ్గించి ధరలు కాస్తంత కిందకు దించడం, పీఎం–ఆవాస్‌ యోజన తరహా కొత్త పథకం, విద్యుత్‌ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ‘ఆర్థిక సాయం’ కోసం మధ్యతరగతి వర్గాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. పన్ను శ్లాబులను సరళీకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఆరోసారి పద్దుల చిట్టాతో పార్లమెంట్‌ గడప తొక్కుతున్న విత్తమంత్రి ఏమేరకు జనాలపై అద్భుత పథకాల పన్నీరు చల్లుతారో చూడాలి మరి.

whatsapp channel

మరిన్ని వార్తలు