మగ సంతానం లేదని బాలుడి కిడ్నాప్‌ | Sakshi
Sakshi News home page

మగ సంతానం లేదని బాలుడి కిడ్నాప్‌

Published Wed, Jan 31 2024 6:00 AM

బాలుడిని తల్లికి అప్పగిస్తున్న డీసీపీ సాయి చైతన్య  - Sakshi

చాంద్రాయణగుట్ట: పేట్ల బురుజు ఆసుపత్రి వద్ద వారం రోజుల క్రితం చోటు చేసుకున్న ఆరేళ్ల బాలుడి కిడ్నాప్‌ కేసును హుస్సేనీఆలం పోలీసులు మంగళవారం ఛేదించారు. బాలుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించి, కిడ్నాప్‌కు పాల్పడిన వారిలో ఇద్దర్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మగ సంతానం లేదని దంపతులిద్దరు ఓ పరిచయస్తుడి సహాయంతో కిడ్నాప్‌కు పాల్పడ్డారు. పురానీ హవేళీలోని తన కార్యాలయంలో అదనపు డీసీపీ షేక్‌ జహంగీర్‌, చార్మినార్‌ ఏసీపీ రుద్ర భాస్కర్‌లతో కలిసి దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య కేసు వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం ఈర్ల దిన్నె గ్రామానికి చెందిన కుర్వ గీత తొమ్మిది నెలల గర్భవతి. ఈమె తన కుమారుడు శివకుమార్‌ (6)తో కలిసి ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి అడ్మిట్‌ అయింది.

ఈ నెల 23వ తేదీన సాయంత్రం తల్లి ఆసుపత్రిలో ఉండగా, కుమారుడు బయట ఆడుకుంటున్నాడు. కాసేపయ్యాక వచ్చి చూడగా కనిపించలేదు. దీంతో ఎవరో తీసుకెళ్లారని భావించిన ఆమె హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసును నమోదు చేసి చార్మినార్‌ ఏసీపీ రుద్ర భాస్కర్‌ పర్యవేక్షణలో ప్రత్యేకంగా నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి పోలీసులు గాలించారు. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా పెద్ద అంబర్‌పేటలో నిందితుల కదలికలను గుర్తించారు. చివరకు హయత్‌నగర్‌ బస్టాప్‌లో ఉన్న వెంకన్న,ఆయన భార్య కవితలను మంగళవారం ఉదయం అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి బాలుడిని విడిపించారు. మరో ఇద్దరు నాగరాజు, కళమ్మ పరారీలో ఉన్నారు.

మగ సంతానం లేదనే..
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా గ్రామానికి చెందిన ఒరుసు వెంకన్న (30), కవిత(26) దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ఐదు నెలల క్రితం వలస వచ్చి పెద్ద అంబర్‌పేటలో నివాసం ఉంటున్నారు. మగ సంతానం కావాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఎవరైనా బాలుడిని కిడ్నాప్‌ చేయాలని భావించారు. ఇందుకోసం పరిచయస్తుడైన సూర్యాపేట జిల్లా బరాఖాత్‌గూడెం గ్రామానికి చెందిన దర్శనం నాగరాజు సాయం కోరారు. రూ.లక్ష ఇస్తే పేట్లబురుజు ఆసుపత్రి వద్ద ఎవరినైనా కిడ్నాప్‌ చేసి ఇస్తానని తెలిపాడు. ఇందుకోసం రూ.60 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్న నాగరాజు...తన భార్య కళావతి, వెంకన్న దంపతులతో కలిసి ఈ నెల 23న పేట్లబురుజు ఆస్పత్రిలో చిన్నారికి చాక్లెట్‌ ఆశచూపి కిడ్నాప్‌ చేశారు. చివరకు పట్టుబడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement