జర్నలిస్ట్‌ గోపాల్‌ అదృశ్యం కేసులో వీడని మిస్టరీ 

14 Jul, 2022 08:12 IST|Sakshi
గోపాల్‌ (ఫైల్‌)

హతమా... అదృశ్యమా? 

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: వివిధ దినపత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేసిన చింతమాను గోపాలకృష్ణ (35) అదృశ్యమై ఐదేళ్లవుతున్నా నేటికీ ఆచూకీ లభ్యం కాలేదు. 2017, నవంబరు 11న గోపాలకృష్ణ కనిపించకుండా పోయాడని అతని తల్లి చింతమాను లక్ష్మమ్మ ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో పోలీసులు 97/2017 క్రైం నంబర్‌ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గోపాలకృష్ణ ఎక్కడున్నది గుర్తించలేకపోయారు. కుమారుడు బతికున్నాడో.. లేదో తెలియని స్థితిలో అతని తల్లి మంచం పట్టి చివరకు అనారోగ్యంతో మృతి చెందింది.
చదవండి: డ్రైవర్‌తో వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్తను మాట్లాడాలని పిలిచి..

అనంతరం గోపాల్‌ భార్య, పిల్లలు కూడా కనిపించకుండా పోయారు. గోపాల్‌ సోదరి తెలంగాణలో ఉన్నట్లు సమాచారం. అడిగేవారు లేకపోవడంతో గోపాల్‌ కేసును పోలీసులు అటకెక్కించేశారు. కాగా, గోపాలకృష్ణను హత్య చేశారన్న వదంతులూ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒక జర్నలిస్టు అదృశ్యమై ఐదేళ్లవుతున్నా పోలీసులు ఆచూకీ కనుగొనలేదంటే దర్యాప్తు ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఇప్పటికైనా జర్నలిస్ట్‌ సంఘాలు ఉద్యమించి గోపాల్‌ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని పలువురు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు