‘రెండు గుంటలు’.. రెండు హత్యలు

10 Jan, 2022 11:17 IST|Sakshi
రాజేశ్‌ (ఫైల్‌)

సాక్షి, జగిత్యాల (కరీంనగర్‌): ప్రేమానురాగాలు మరిచారు.. స్నేహం, బంధుత్వాలు పట్టవనుకున్నారు.. కేవలం రెండు గుంటల భూమి కోసం నెలకొన్న వివాదం అన్నదమ్ముల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది.. పరస్పరం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో జగిత్యాల అర్బన్‌ మండలం ధరూర్‌ గ్రామ శివారులో ఈరిశెట్టి రాజేశ్‌(28) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..  

ధరూర్‌కు చెందిన ఈరిశెట్టి బుచ్చిలింగంకు నలుగురు కుమార్తెలు. వీరిలో ముగ్గురికి వివాహాలు చేశారు. మరో కూతురు రాజేశ్వరికి మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన బక్కశెట్టి గంగారెడ్డితో పెళ్లి జరిపించి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు.
 బుచ్చిలింగం అన్న కుమారుడు ఈరిశెట్టి వెంకన్న, అల్లుడు గంగారెడ్డిలకు ఒకేచోట చెరో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వెంకన్నకు రెండు గుంటల భూమి ఎక్కువ ఉందనే కారణంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది.
 ఈ రెండు గుంటల్లో తనకో గుంట ఇవ్వాలని గంగారెడ్డి, తాను ఇవ్వబోనని వెంకన్న ఘర్షణ పడుతున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి.
 ఈ క్రమంలో 24 మే 2020న గంగారెడ్డి, అతడి కుమారులు వేణు, సతీశ్, సంతోష్‌లు వెంకన్న ఇంటికి వెళ్లారు. తమకు గుంట భూమి ఇవ్వాల్సిందేనని గొడవకు దిగారు. ఆగ్రహించిన వెంకన్న, అతని కుమారులు రాజేశ్, రాకేశ్‌లు గంగారెడ్డిని కత్తితో పొడిచి, చంపారు.
 ఈ కేసులో వెంకన్న, రాజేశ్, రాకేశ్‌లు జైలుకు వెళ్లి, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అయి తే, తమ తండ్రిని చంపిన వారిని ఎలాగైనా హతమార్చాలని గంగారెడ్డి కుమారులు భావించారు. ఇందుకు మరికొందరి సాయం తీసుకున్నారు. 
  ఆదివారం ఉదయం వెంకన్న కుమారుడు రాజేశ్‌ తన మొక్కజొన్న చేను వద్దకు వెళ్తుండగా గ్రామ శివారులో తల్వార్, ఇనుపరాడ్లతో కొట్టి, హత్య చేశారు.
►జగిత్యాల రూరల్‌ సీఐ కృష్ణకుమార్, ఎస్సై అనిల్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీస్‌ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. 
 రాజేశ్‌కు భార్య లత, కూతురు అక్షర(4), కుమారుడు మన్విత్‌(3) ఉన్నారు. లత ఐదోవార్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. అతని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
  మృతుడి సోదరుడు రాకేశ్‌ ఫిర్యాదు మేరకు వేణు, సంతోష్, సతీశ్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు