భూతగాదాలు, పాత కక్షలు.. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా..

21 Jun, 2021 09:11 IST|Sakshi

కత్తులతో దుండగుల దాడి

ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కోహీర్‌(జహీరాబాద్‌): పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కాపుకాచి కత్తులతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోహీర్‌ మండలం మద్రి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. మద్రి గ్రామానికి చెందిన ఎండీ జహీర్‌ (45) ఆదివారం మధ్యాహ్నం తన అన్న సలీంతో కలిసి ఫార్చునర్‌ వాహనంలో గ్రామ శివారులోని పొలానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మధ్యలో ఆగి చెట్ల నీడలో సేదదీరుతున్నారు. ఇదే అదనుగా దుండగులు కత్తులతో దాడి చేసి తలపై నరికారు. తీవ్రంగా గాయపడిన జహీర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

సలీం గాయాలతో తప్పించుకున్నాడు. వీరి మధ్య ఉన్న భూతగాదాలు, పాత కక్షలే హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు. హత్య చేసిన అనంతరం దుండగులు పారిపోతున్న వాహనం మద్రి–గురుజువాడ గ్రామాల మధ్య కారును ఢీకొని రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోయింది. వాహనంలో నుంచి ఎలాగోలా బయటపడిన దుండగులు పారిపోయారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్‌ సీఐ రాజశేఖర్, కోహీర్‌ ఎస్‌ఐ చల్లా రాజశేఖర్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: భార్య కాపురానికి రావడం లేదని..

మరిన్ని వార్తలు