వివాహితుడు, బాలిక ఆత్మహత్య

31 Jul, 2020 10:27 IST|Sakshi

ఓ వివాహితుడు, బాలిక ఆత్మహత్య

ఇద్దరివీ పక్క పక్క బిల్డింగులే 

మిస్టరీగా మారిన సంఘటనలు 

తూర్పుగోదావరి ,ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): పక్క పక్క బిల్డింగ్‌లు వారివి... ఏం జరిగిందో ఏమో.. ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని మృతదేహం వద్ద రోదించిన బాలిక కొద్ది సేపటికే ఇంటికెళ్లి ఉరేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధి 16వ డివిజన్‌లోని వాంబే కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ పది నిమిషాల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. మృతి చెందిన వివాహితుడికి భార్య, ఐదేళ్ల పాప ఉండగా బాలిక తల్లి దుబాయ్‌లో పనికి వెళ్లగా తమ్ముడితో కలసి ఆమె ఇక్కడ ఉంటోంది. బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.లక్ష్మణరెడ్డి, ఎస్సై కె.శివాజీలు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..

రాజానగరం మండలం రామస్వామిపేటకు చెందిన రౌతు శివ (29) ఏడేళ్ల కిందట సత్యశ్రీని వివాహం చేసుకోగా ఐదేళ్ల రోషిణి సాయి కుమార్తె ఉంది. నాలుగేళ్ల నుంచి వారంతా వాంబే కాలనీలో ఉంటున్నారు. శివ, అతని భార్య సత్యశ్రీ నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నారు. గురువారం ఉదయం సత్యశ్రీ బయటకు వెళ్లి వచ్చే సరికి ఇంటి లోపల గడియపెట్టి ఎంత కొట్టినా భర్త శివ తీయకపోవడంతో పక్కింటి వారిని, ఇతరులను పిలిచింది. తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండడంతో అతన్ని కిందకు దించి చూసే సరికి మృతి చెందాడు. శివ మృతదేహం వద్దకు బ్లాక్‌ నంబరు–6లో తమ్ముడితో కలసి ఉంటున్న దుర్గాదేవి (17) వచ్చి రోదించింది. ఈ లోగా ఆమెను అక్కడున్న వారిలో ఒకరు మందలించడంతో పరుగెత్తుకుని ఇంటికి వెళ్లి తలుపు వేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు. తలుపు తీయకపోవడంతో బద్దలు గొట్టి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండగా దుర్గాదేవిని కిందకు దించారు. చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది.  

ఆర్థిక సమస్యలే కారణం 
ఆర్థిక సమస్యలతోనే తన భర్త రౌతు శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సత్యశ్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరం వస్త్ర దుకాణంలో పని చేస్తున్నామని, కరోనా వైరస్‌ నేపథ్యంలో కొంత ఆర్థిక సమస్య ఏర్పడిందని, దాని వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె చెప్పింది. ఈ మేరకు ఎస్సై శివాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కొట్టడం వల్లే మనస్తాపం చెంది.. 
అన్నగా పిలిచే శివ మృతదేహం వద్దకు దారా దుర్గాదేవి వెళ్లినప్పుడు ఒక వ్యక్తితో పాటు మరో ముగ్గురు కొట్టడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని బాలిక మేనమామ రమణ బొమ్మూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గాదేవి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

లే డాడీ లే... అంటూ 
రౌతు శివ మృతదేహం వద్ద అతని భార్య సత్యశ్రీతో పాటు ఐదేళ్ల కుమార్తె రోషిణి సాయి కూర్చుని ‘లే డాడీ లే...’ అని అనడం అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది. ఆ చిన్నారికి తామేం సమాధానం చెప్పాలంటూ సత్యశ్రీ, శివ తండ్రి రౌతు శ్రీను రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ పాపతో కలసి జీవిస్తున్న తరుణంలో శివ ఆత్మహత్యకు పాల్పడడం మింగుడు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ తల్లికి ఏం చెప్పాలి 
దుర్గాదేవి మృతి చెందడంతో దుబాయ్‌లో ఉన్న ఆమె తల్లి సుజాతకు ఏం సమాధానం చెప్పాలని పిన్ని పగడాల సీతామహాలక్ష్మి రోదించింది. దుర్గాదేవిని తనకు అప్పగించి వెళ్లిన ఆమెకు తన ముఖం ఎలా చూపించాలంటూ బాధపడింది. అన్యాయంగా కొంతమంది కొట్టడంతోనే బాలిక మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేసింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా