పెళ్లయిన ఎనిమిది నెలలకే అఘాయిత్యం  

28 Aug, 2021 08:43 IST|Sakshi
రహదారిపై రాస్తారోకో చేస్తున్న కుటుంబ సభ్యులు

సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్‌): మండలంలోని సవర్గాం గ్రామానికి చెందిన నాలుగు నెలల గర్భిణి జాదవ్‌ సంగీత(22) శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను అత్తింటి వారే హత్య చేశారంటూ నేరడిగొండ జాతీయ రహదారిపై మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్‌హత్నూర్‌ మండలం కాండ్లి గ్రామానికి చెందిన చౌహాన్‌ రామేశ్వర్, అనసూయ దంపతుల కూతురు సంగీతకు 2021 జనవరి 6న నేరడిగొండ మండలం సవర్గాం గ్రామానికి జాదవ్‌ విజయ్‌తో వివాహం జరిగింది.

శుక్రవారం సవర్గాం గ్రామంలోని ఇంట్లో సంగీత పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. ఈ విషయాన్ని స్థానికులు బజార్‌హత్నూర్‌ మండలం కాండ్లి గ్రామంలో ఉంటున్న మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతోవారు బంధువులతో కలిసి సవర్గాం చేరుకున్నారు. తమ కూమర్తెను చంపుతామని కొద్దిరోజులుగా సంగీత భర్త, మామ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారే సంగీతను హత్య చేశారని నేరడిగొండ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

విషయం తెలుసుకున్న బోథ్‌ సీఐ నైలు, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. గర్భిణిగా ఉన్న సంగీత కడుపునొప్పి భరించలేకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై భరత్‌సుమన్‌ తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం బోథ్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

చదవండి: పెళ్లి బరాత్‌.. అంతలో సడన్‌గా పోలీసుల ఎంట్రీ !

మరిన్ని వార్తలు