కంగనపై మరో కేసు: ‘రూ.100కు యాక్ట్‌ చేసే గతి పట్టలేదు’

9 Jan, 2021 20:00 IST|Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సూపర్‌ స్టార్లు సైతం స్పందించడానికి భయపడే అనేక అంశాలపై ‘క్వీన్’‌ నటి స్పందిస్తారు. నిర్భయంగా.. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఇక తాజాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం గురించి కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్న 73 ఏళ్ల వృద్ధురాలు మొహిందర్‌ కౌర్‌ని చూసి కంగన షాహీన్‌ బాగ్‌ దాదీగా భావించి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘టైమ్స్‌ మ్యాగ్‌జైన్‌ ఈ దాదీని శక్తివంతమైన మహిళగా గుర్తించింది. కానీ ఇమె కేవలం 100 రూపాయల కూలీ కోసం ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నారంటూ’ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: వివాదాస్పద ట్వీట్‌‌.. కంగనకు నోటీసులు)

కంగన వ్యాఖ్యలపై తాజాగా మొహిందర్‌ కౌర్‌ బతిండ కోర్టులో కేసు నమోదు చేశారు. న్యాయవాది రఘుబీర్ సింగ్ దాఖలు చేసిన ఈ ఫిర్యాదులో కంగన ట్విట్టర్‌లో తప్పుదోవ పట్టించేలా చేసిన పోస్ట్ కారణంగా, బాధితురాలు మొహిందర్‌ కౌర్‌ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ప్రజల దృష్టిలో పరువు, ప్రతిష్టం కోల్పోయి.. తీవ్రమైన మానసిక ఉద్రిక్తత, వేదన, వేధింపులు, అవమానం, వంటి వాటితో బాధపడుతోందని పేర్కోన్నారు.

ఈ సందర్భంగా మొహిందర్‌ కౌర్‌ మాట్లాడుతూ.. ‘తరతరాలుగా మా కుటుంబం వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతోంది. కేంద్ర తీసుకువచ్చిన చట్టాలు రైతులకు అన్యాయం చేస్తాయి. అందుకు నిరసనగా వేలాది మంది రైతులు రాజధానిలో ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతు తెలపడం కోసం నేను, నా కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి.. ఆందోళనలో పాల్గొని..  రైతులకు మద్దతు తెలిపాం. నాకు 13 ఎకరాల భూమి ఉంది. కేవలం 100 రూపాయల కోసం నటించాల్సిన అవసరం లేదు’ అంటూ మొహిందర్ కౌర్ ఘాటుగా స్పందించారు. ఇక జనవరి 11న దీనిపై విచారణ జరగనుంది. ఇక ఇదే వ్యాఖ్యలపై గతంలో కంగనపై మరో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు