విషాదం: బిడ్డలతో కలిసి నిప్పంటించుకున్న తల్లి  

13 Jul, 2021 07:03 IST|Sakshi

తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతి

బనశంకరి(కర్ణాటక): ఉత్తర కర్ణాటక ప్రాంతంలో రెండు విషాద సంఘటలు అనుబంధాలను ఆవిరి చేశాయి. భర్త వేధింపులను తట్టుకోలేక ఓ తల్లి ముగ్గురు పిల్లలకు నిప్పుపెట్టి తానూ నిప్పటించుకుంది. తీవ్రంగా గాయపడిన వారిని విజయపుర (బిజాపుర) జిల్లా ఆసుపత్రికి తరలించగా, తల్లి కొద్ది గంటల్లోనే చనిపోయింది. ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతూ రెండురోజుల తరువాత మృతి చెందారు.

జమఖండి తాలూకా మదురఖండి గ్రామ నివాసి బిస్మిల్లా (28) అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆదివారం అర్ధరాత్రి యసీదా (6) సనా (4) అనే ఇద్దరు ఆడపిల్లలు మృతిచెందారు. మూడో కుమారుడు సమీర్‌ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ విషయమై భార్యాభర్త తరచూ గొడవ పడేవారు. భర్త దస్తగిరి సాబ్‌ను జమఖండి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కలబురిగి వద్ద అన్నాచెల్లెలు మృత్యువాత  
కలబురిగి జిల్లాలో బైక్, టెంపో, కారు వరుసగా ఢీకొనడంతో అన్నాచెల్లెలు అసువులు బాశారు. అఫ్జలపుర తాలూకా శివూరు గ్రామ నివాసులైన అజయ్‌ రోడగి (29), ప్రేమా ప్రవీణ (27) మృతులు. సోమవారం ఇద్దరు బైకులో కలబురిగి నుంచి అఫ్జలపురకు బయలుదేరగా, కలబురిగి శివార్లలో టెంపో, కారు గుద్దుకొని బైక్‌ను ఢీకొట్టాయి. తీవ్రగాయాలపాలైన అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతిచెందారు. టెంపో, కారులోని మరో ఐదుగురికి గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కలబురిగి ట్రాఫిక్‌ పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు.   

మరిన్ని వార్తలు