-

బ్యాంక్‌పై కోపం.. ‘నగరంపై మరో ఉగ్ర దాడి’ అంటూ    

14 Oct, 2021 07:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సేవల్లో నిర్యక్షంతో నగరవాసి అసహనం

బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌కు బెదిరింపు ఈ–మెయిల్‌ 

ముంబైపై మరో ఉగ్రదాడి జరుగుతుందంటూ వారి్నంగ్‌ 

సైబర్‌ టెర్రరిజం కింద అక్కడ కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: ఓ బ్యాంకు సేవలు నచ్చకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడమో, ఖాతాను మరో బ్యాంకులోకి మార్చుకోవడమో చేస్తాం. నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం సహనం కోల్పోయి బెదిరింపులకు దిగాడు. ముంబైలోని ఆ బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌కు ‘నగరంపై మరో ఉగ్ర దాడి జరగనుంది’ అంటూ ఈ–మెయిల్‌ పంపాడు. ఫలితం సైబర్‌ టెర్రరిజం ఆరోపణలపై కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. వివరాలిలా ఉన్నాయి... 

నగరానికి చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగికి ఓ జాతీయ బ్యాంకులో పెన్షన్‌ ఖాతా ఉంది. పెన్షన్‌ నిబంధనల ప్రకారం ఈ ఖాతా వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాల్సి ఉంది. జాప్యం కావడంతో కొన్నాళ్లుగా సదరు రిటైర్డ్‌ ఉద్యోగికి పెన్షన్‌ అందట్లేదు. దీంతో ఆయన దీనిపై ఆ బ్యాంక్‌ డిప్యూటీ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండిపోవడంతో పలుమార్లు ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో (బీకేసీ) ఉన్న బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్లు, ఈ–మెయిల్స్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయిన నగరవాసి ఆవేశపడ్డారు. బ్యాంకు కస్టమర్‌ కేర్‌ ఈ–మెయిల్‌ ఐడీకి మరో మెయిల్‌ పంపారు. 

ఈ కాల్‌ సెంటర్‌ ముంబైలోని బీకేసీ కాంప్లెక్స్‌లో ఉందని తెలిసిన ఆయన తన ఈ–మెయిల్‌లో అతి త్వరలోనే అక్కడ ఉగ్రదాడి జరుగనుందని, దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అదే మెయిల్‌లో తన బ్యాంకు ఖాతా నెంబర్, వివరాలను పొందుపరిచారు. దీన్ని చూసి కంగుతిన్న కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు విషయాన్ని బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బ్యాంకు అధికారులు దీనిపై ఎంఆర్‌ఏ మార్గ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు నగరవాసిపై ఐపీసీలోని 506, 507లతో పాటు ఐటీ యాక్ట్‌లో సైబర్‌ టెర్రరిజానికి సంబంధించిన 66 ఎఫ్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్యాంకు ఖాతా వివరాలను బట్టి బాధ్యుడు హైదరాబాద్‌ వాసిగా తేల్చారు. బెదిరింపు ఈ–మెయిల్‌ వచి్చన ఐపీ అడ్రస్‌లో ఆధారాలు సేకరిస్తున్నారు. 

అతడి వివరాలు గోప్యంగా..
నిందితుడిని అరెస్టు చేయడానికి ఎంఆర్‌ఏ మార్గ్‌ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం త్వరలో హైదరాబాద్‌కు రానుంది. ఈ విషయంపై సదరు ఠాణా అధికారిని సాక్షి బుధవారం ఫోన్‌ ద్వారా సంప్రదించగా ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి పేరు, వివరాలతోపాటు బ్యాంక్‌ అధికారుల కోరిక మేరకు ఆ వివరాలు బయటకు చెప్పలేమని అన్నారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం, సేవల్లో లోపంపై స్పందించాల్సిన తీరు ఇది కాదని వ్యాఖ్యానించారు.  
 

మరిన్ని వార్తలు