Crime: రూ. 8.54లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

7 Jan, 2022 09:01 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): రైళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితురాలిని విజయవాడ గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి రూ. 8.54లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం మోహరంపేటకు చెందిన కుష్బు సురేష్‌జైన్‌ కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 3న అహ్మదాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు రైలులో బయలుదేరారు. అతని తల్లి బంగారు ఆభరణాలు ఉన్న ఉన్న హ్యాండ్‌ బ్యాగును తలవద్ద పెట్టుకుని నిద్రించింది. 4వ తేదీ తెల్లవారుజామున రైలు విజయవాడ స్టేషన్‌లో కొద్దిసేపు ఆగి తిరిగి బయలుదేరిన సమయంలో చూసుకుంటే ఆమె తల వద్ద ఉండాల్సిన హ్యాండ్‌ బ్యాగ్‌ కనిపంచలేదు. రైలు విశాఖ పట్నం చేరుకున్న అనంతరం అక్కడ జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హ్యాండ్‌ బ్యాగులో 270 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 4వేల నగదు, ఐ ఫోన్, ఇతర గుర్తింపు కార్డులు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, విజయవాడ జీఆర్‌పీ స్టేషన్‌కు బదిలీ చేశారు.  

సీసీ ఫుటేజీ ఆధారంగా.. 
స్పందించిన విజయవాడ రైల్వే పోలీసులు ఘటన జరిగిన సమయంలో ప్లాట్‌ఫాంపై సీసీ ఫుటేజీలను పరిశీలించి.. ఒడిశా రాష్ట్రం కొండజిల్లాకు చెందిన తుని దే అలియాస్‌ కుమారిప్రార్థం(46)ను గుర్తించారు. ఆమె శ్రీకాకుళం, పలాసా, విశాఖపట్నం, విజయవాడ స్టేషన్‌లలో అనేక నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి తిరిగి, తన నేరప్రవృత్తిని కొనసాగిస్తుంది. దీంతో ఆమెపై నిఘా పెట్టి.. విజయవాడ శివాలాయం వీధిలో అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆమె వద్ద ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.   

చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీంకోర్టులో విచారణ!

మరిన్ని వార్తలు