భూతవైద్యుడితో పాటు సహకరించిన వ్యక్తుల అరెస్టు

5 Aug, 2020 10:49 IST|Sakshi

 జైపూర్‌(చెన్నూర్‌): భూత వైద్యం పేరిట బాలింతను చింత్రహింసలకు గురిచేసిన మాంత్రికుడు, అతడికి సహకరించిన వ్యక్తులను మంగళవారం జైపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. భూతవైద్యం నెపంతో మండలంలోని కుందారం గ్రామంలో బాలింతను చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. భూతవైద్యంపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జైపూర్‌ అసిస్టెంట్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ భూపతి నరేందర్, శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌ వివరాలను వెల్లడించారు.

కరీంగనర్‌ జిల్లా శంకరపట్నం మండలం గడ్డపాక గ్రామానికి చెందిన కనుకుట్ల రజిత, జైపూర్‌ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్‌లు ప్రేమించుకొని గత ఏడాది మంచిర్యాల ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి ప్రస్తుతం మూడు నెలల పాప కూడా ఉంది. రజిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం.. ప్రేమవివాహం కావడంతో కట్నం తీసుకురాలేదన్న కోపంతో రజితను ఎలాగైన వదిలించుకోవాలని రజిత భర్త మల్లేశ్, అతని కుటుంబ సభ్యులు రజిత బంధువు పులికోట రవీందర్‌తో కలిసి పథకం రచించారు. దీనికి జమ్మికుంట మండలం శాయంపేట గ్రామానికి చెందిన దొగ్గల శ్యామ్‌ అనే భూతవైద్యుడిని సంప్రదించారు.

గతనెల 21న కుందారం గ్రామంలోని మల్లేశ్‌ ఇంటికీ రవీందర్, శ్యామ్‌లు వచ్చి రజితకు దెయ్యం పట్టిందని, దాన్ని వదిలించాలని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రజిత భర్త మల్లేశ్‌ తన ఫోన్లో చిత్రీకరించాడు. రజితకు వెంటనే చికిత్స అందించకుండా మంత్రాల నెపంతో కాలయాపన చేయడంతో రజిత తన సోదరుడు సురేశ్‌కు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమెను వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంగనర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిన రజిత ఆప్పత్రిలోనే మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. కేసులో ప్రధాన నిందితులు ఏ–1 దొగ్గల శ్యామ్‌(భూత వైద్యుడు), ఏ–2 పులికోట రవీందర్‌ (రజిత చిన్నాన్న), ఏ–3 సెగ్యం మల్లేశ్‌ (రజిత భర్త)లను అరెస్టు చేసి వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు