ఏజెన్సీ టు ఢిల్లీ.. వయా కందుకూరు 

3 May, 2022 05:00 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, కార్లు, మద్యం బాటిళ్లు

గంజాయి రాకెట్‌ ఛేదించిన పోలీసులు 

105 కేజీల గంజాయి, 3 కార్లు, మద్యం బాటిళ్లు స్వాధీనం 

ఇద్దరు అరెస్ట్‌ 

కందుకూరు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మీదుగా ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.10 లక్షల విలువజేసే 105 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలో పరారీలో ఉన్న ఇద్దరిని కందుకూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ కండె శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లాకు చెందిన పాములపాటి శ్రీనివాస్‌ వృత్తిరీత్యా సెకండ్‌హ్యాండ్‌ కార్ల వ్యాపారం చేస్తుంటాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు మత్తు పదార్థాలు అక్రమ రవాణా  చేసేవాడు.

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకురావడం.. దేశ రాజధాని ఢిల్లీకి తరలించి అక్కడి ఏజెంట్లకు అప్పజెప్పడం వంటి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో 2016లో రాజమండ్రి పోలీసులు అరెస్టు చేయడంతో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తరువాత 2021లో మరోసారి ఢిల్లీ పోలీసులకు చిక్కి ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా  ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన పాల రవితేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి మళ్లీ గంజాయి అక్రమ రవాణాకు తెరతీశారు. కాగా, గత నెల 24వ తేదీ కందుకూరు ఓవీ రోడ్డులోని పలుకూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్న వీరిద్దరూ పోలీసులను చూసి కారు వదిలేసి పారిపోయారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశీలించి చూడగా.. కారు సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 51 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కందుకూరులోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న శ్రీనివాస్, రవితేజను సోమవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మరో 20కేజీల గంజాయిని, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను, రూ.20వేల విలువజేసే 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు