అనుమానాస్పదం కాదు.. హత్యే!

20 Jul, 2021 20:51 IST|Sakshi

కొప్పోలులో బాలిక హత్యకు ముందు పవన్‌ ఫోన్‌ సంభాషణ

వీడిన బాలిక ప్రీతి మృతి కేసు మిస్టరీ

నల్లగొండ క్రైం: ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన దళిత బాలిక ప్రీతి మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలిక మృతి అనుమానాస్పదం కాదని హత్యేనని, అనుమానంతో ఆమె ప్రియుడే ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలిక హంతకుడి కాల్‌ రికార్డ్‌ను ‘సాక్షి’ సంపాదించింది. కొప్పోలులో బాలిక హత్యకు ముందు పవన్‌ ఫోన్‌ సంభాషణ వెలుగులోకి వచ్చింది. బాలికను చంపేస్తానంటూ స్నేహితుడు రాజుకు పవన్‌ ఫోన్‌ చేయగా, వచ్చి మాట్లాడతానని రాజు వారించాడు. ఫోన్‌ సంభాషణ కంటే ముందే బాలికపై పవన్‌ దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... కేతేపల్లి మండలం  కొప్పోలు గ్రామానికి చెందిన చింతమళ్ల దశరథ అలియాస్‌ శ్రీను, నాగమ్మ దంపతుల కుమార్తె ప్రీతి(17) నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి జూనియర్‌ కళాశాలలో ఒకేషనల్‌ ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో ఉంటోంది. ప్రీతి ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. ప్రీతి అదే గ్రామానికి చెందిన సమీప బంధువు దోరెపల్లి పవన్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అనుమానం పెంచుకుని.. పెళ్లికి నిరాకరించి..
ప్రీతి నల్లగొండలో మరొకరితో సఖ్యతగా మెలుగుతోందని పవన్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రీతిని దూరం పెడుతూ వచ్చాడు. ఇటీవల స్వగ్రామానికి ప్రీతి రావడంతో తలిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. దీనికి పవన్‌ ఒప్పుకోకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. అయినా, పవన్‌ తీరు మార్చుకోకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు.

అర్ధరాత్రి బయటికి పిలిచి..
తల్లిదండ్రులతో కలిసి ప్రీతి ఈ నెల 12వ తేదీనే ఇంట్లోనే నిద్రించింది. కాగా, పవన్‌ అర్ధరాత్రి తర్వాత ఫోన్‌ చేసి ప్రీతిని బయటికి పిలిచాడు. అక్కడినుంచి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలోకి తీసుకెళ్లాడు. అక్కడ పవన్‌ మద్యం సేవించి ప్రీతితో గొడవకు దిగాడు. ప్రీతిని కడతేరుస్తున్నానని.. ప్రీతి పదే పదే పెళ్లి ప్రస్తావన తీసుకురావడాన్ని పవన్‌ జీర్ణించుకోలేకపోయాడు. మరొకరితో తిరుగుతూ నన్ను పెళ్లి చేసుకోమంటావా అంటూ ఘర్షణ పడ్డాడు. అనంతరం తన స్నేహితుడైన సూర్యాపేట సమీపం కొప్పిరెడ్డిగూడేనికి చెందిన రాజుకు ఫోను చేసి ప్రీతిని హత్య చేస్తున్నట్లు చెప్పాడు. పుట్టినరోజు వేడుకలో ఉన్న రాజు, ప్రవీణ్‌తో పాటు మరో మైనర్‌ వెంటనే తాము వస్తున్నామని, ప్రీతిని హత్య చేయొద్దని కోరారు. అనంతరం తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్‌ చున్నీని ప్రీతి మెడకు బిగించి హత్య చేశాడు. కాసేపటికి రాజు, ప్రవీణ్, మరో మైనర్‌ కొప్పోలుకు వచ్చి ఫోన్‌ చేశారు. అప్పటికే ప్రీతిని కడతేర్చినట్లు పవన్‌ చెప్పడంతో వెనుదిరిగారు.

ఫోన్‌కాల్స్‌ డేటా ఆధారంగా..
తమ కుమార్తెతో చనువుగా ఉంటున్న పవన్‌ హత్య చేసి ఉంటాడని ప్రీతి తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం కావడంతో ఎస్పీ రంగనాథ్‌ ప్రీతి మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించారు. అయితే, తుది నివేదికలో సైతం ప్రీతిని చున్నీతో ఉరి బిగించి హత్య చేసినట్లు తేలడంతో పవన్, ప్రీతి ఫోన్‌కాల్స్‌ డేటాను సేకరించారు. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. అయితే, హ త్యోదంతాన్ని దాచి పెట్టిన రాజు, ప్రవీణ్, మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎస్పీ రంగనాథ్‌ను వివరణ కోరగా  నిందితులను అరెస్ట్‌ చేశామని,  పూర్తి స్థాయి విచారణ అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు