కరోనా అని చెప్పి.. డబ్బులు గుంజి

28 Aug, 2020 09:06 IST|Sakshi
నిందితులను అరెస్టు చూపుతున్న పోలీసులు 

కటకటాల పాలైన ముగ్గురు నిందితులు

అంబులెన్స్‌తో సహా రూ. 69 వేలు సీజ్‌ 

కర్నూలు (టౌన్‌): సాధారణ మరణం చెందినా.. కరోనా అని చెప్పి మృతుని కుటుంబ సభ్యులను భయాందోళలకు గురిచేసి డబ్బు గుంజిన అంబులెన్స్‌ యజమానితో పాటు మరో ఇద్దరిని పోలీసులు కటాకటాలకు పంపించారు. ఈ సంఘటనకు సంబంధించి గురువారం మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో సీఐ తబ్రేజ్‌ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 వ తేదీ  కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీకి చెందిన సాయినాథరావు అనే వ్యక్తి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెనొప్పితో మృతిచెందాడు. అయితే కాటం జయరాజు (అంబులెన్స్‌ యజమాని, బుధవారపేట), తాటిపాటి చిన్న తిరుపాల్‌ (బోయగేరి, బుధవారపేట), జగ్గుల వెంకట గిరి ( స్వీపర్, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి) అనే ముగ్గురు.. సాయినాథరావు భార్య నీరజాబాయి, వారి బంధువులకు కరోనాతో మృతి చెందినట్లు చెప్పారు. తామే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని రూ. లక్ష  డిమాండ్‌ చేశారు.

చివరికి రూ. 91 వేలు కుదుర్చుకొని రూ. 50 వేలు ఫోన్‌పే ద్వారా మిగతా రూ. 41 వేలు నగదు రూపంలో తీసుకున్నారు. అయితే కరోనాతో చనిపోయిన వారికి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందన్న విషయాన్ని మృతుని బంధువు ఆంజనేయులు తెలుసుకొని.. మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ...కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి పాత కాన్పుల వార్డు వద్ద ఉన్న నిందితులను అరెస్టు చేశారు. అంబులెన్స్‌తో పాటు బాధితుల నుంచి తీసుకున్న మొత్తం రూ. 69 వేలు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు సీఐ  వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు