హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

25 Aug, 2020 09:25 IST|Sakshi
పోలీసులకు వివరిస్తున్న గ్రామస్తులు, నాయకులు

ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐల ఆధ్వర్యంలో వేగవంతంగా దర్యాప్తు

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ 

తాళ్లూరు: వైఎస్సార్‌ సీపీ నాయకుడు మారం సుబ్బారెడ్డి హత్య కేసులో సోమవారం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటన జరిగిన వెంటనే రజానగరం గ్రామంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌  ఆధారాలు సేకరించారు. సోమవారం చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దర్శి, పొదిలి, అద్దంకి, ఇంకొల్లు సీఐలు   శ్రీరామ్, ఎండీ మొయిన్, ఆంజనేయ రెడ్డి, రాంబాబు, ఎస్సైలు నాగరాజు, ఆంజనేయులు, రామకృష్ణ పోలీసుల  బృందం  ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో వీధి వీధిన తిరిగి బంధువులను విచారించారు.  
కేసును త్వరితగతిన ఛేదిస్తాం...   
పూర్తి స్థాయిలో విచారించి తగిన ఆధారాలు సేకరించి త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని దర్శి సీఐ ఎండీ మొయిన్‌ తెలిపారు.  మృతునికి బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఏమైనా నగదు వ్యవహారాలు, ఇతర అంశాల్లో ఎవరితోనైనా విభేదాలున్నాయా అని ఆరా తీశామన్నారు. లేక గ్రామంలో సైకోగా అనుమానిస్తున్న వ్యక్తి పనేనా? అన్న విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విజిలెన్స్‌ డీఎస్పీ అశోక్‌ వర్ధన్, ఇంటలిజెన్స్‌ ఎస్సై రామారావు గ్రామాన్ని సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు.

జీపు నడుపుతూ గ్రామంలో పర్యటిస్తున్న ఎస్పీ..   

భయాందోళన చెందుతున్న గ్రామస్తులు: 
గ్రామానికి చెందిన వారు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఉంటుండగా వారి తల్లిదండ్రులు గ్రామంలో ఉంటూ పొలాలు చూసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక్కసారిగా గొంతు కోసి దారుణంగా చంపిన సంఘటన గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గ్రామంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.  

పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించండి: ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ 
హత్య జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌  పరిశీలించారు. అన్నం తినే సమయంలో కూర్చున్న స్థలం, వెనకవైపు గోడ, ఖాళీ ప్రదేశాలను చూశారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ గ్రామంలో విచారించి ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే దారులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో సమాచారం సేకరించాలని చెప్పారు. అనుమానుతుల వివరాలు, వారి ప్రవర్తన తీరు, హతుడి ఆర్థిక పరిస్థితులపై పూర్తిగా ఆరా తీయాలని సూచించారు. ముందుగా తాళ్లూరు స్టేషన్‌ ఆవరణలో గతంలో రజానగరంలో జరిగిన ఘర్షణలో శేషయ్య అనే వ్యక్తిపై దాడి చేసిన పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం రోడ్డు మార్గంలో స్వయంగా ఎస్పీ జీపు నడుపుకుంటూ ఆయా ప్రాంతాల్లో పరిశీలించాల్సిన విధానాన్ని చీరాల డీఎస్పీ, దర్శి సీఐలకు వివరించారు. 

మరిన్ని వార్తలు