యువతిపై ఘాతుకం.. ఆపై హత్యచేసిన దంపతులు

3 Nov, 2020 15:06 IST|Sakshi

17 ఏళ్ల యువతిని హత్య చేసిన దంపతులు

న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం దేశ రాజధానికి వచ్చిన 17 ఏళ్ల యువతిని సొంతవాళ్లే కడతేర్చారు. కూతురు వరసయ్యే బాధితురాలిపై కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగడితే.. ఆమెను చంపేస్తేనే సమస్యలు తీరిపోతాయంటూ అతడి భార్య హత్యకు పురిగొల్పింది. ఇద్దరూ కలిసి ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఏమీ తెలియని అమాయకుల్లా నటించి.. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. ప్రస్తుతం జైళ్లో ఊచలు లెక్కపెడతున్నారు. ఈశాన్య ఢిల్లీలోని నంద్‌నగరి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. వకీల్‌ పోదార్‌(51) రిక్షా నడుపుతుండగా, అతడి భార్య భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

ఈ క్రమంలో వారి బంధువుల అమ్మాయి ఉన్నత విద్య కోసమని ఢిల్లీకి వచ్చింది. వదిన కూతురైన బాధితురాలిపై కన్నేసిన వకీల్‌.. భార్య ఇంట్లో లేని సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఆమె నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత ఓరోజు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు, వకీల్‌ భార్యతో చెప్పగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. చినికి చినికి గాలివానలా మారి వివాదం మరింత ముదిరింది. దీంతో ఆ అమ్మాయిని వెంటనే ఇక్కడి నుంచి పంపేయాలని వకీల్‌ భార్య పట్టుబట్టగా, బాధితురాలు అందుకు నిరాకరించింది. ఇక్కడే ఉండి చదువుకుంటానని చెప్పింది. (చదవండి: విషాదం: నీ వెంటే మేమూ!)

దీంతో విసుగుచెందిన వకీల్‌ భార్య.. 17 ఏళ్ల ఆ యువతిని హత్యచేయమని భర్తకు చెప్పింది. ఈ క్రమంలో అక్టోబరు 23న వకీల్‌ ఇనుపరాడ్డుతో బాధితురాలి తలపై బలంగా కొట్టడంతో ఆమె మృతిచెందింది. అనంతరం భార్యాభర్తలు కలిసి శవాన్ని బెడ్‌-బాక్స్‌లో దాచిపెట్టారు. ఆ తర్వాత బాధితురాలు మిస్సయినట్లు ఫిర్యాదు అందుకున్న.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడి భార్యను విచారిస్తున్న క్రమంలో.. ఘటన జరిగిన రోజు తాను ఇంటికి వచ్చేసరికి అమ్మాయి కనిపించలేదని, ఆమెను ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల అనాధాశ్రమానికి పంపించినట్లు భర్త తనకు చెప్పాడని పేర్కొంది. ఆ దిశగా దర్యాప్తు చేయగా... వకీల్‌ భార్య చెప్పిందంతా అబద్ధమని తేలింది. (చదవండి: ఉరి తీయండి లేదా ఎన్‌కౌంటర్ చేయండి)

ఈ క్రమంలో నిందితుల ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. వకీల్‌, అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వకీల్‌ హత్య చేసిన సమయంలో, అతడి భార్య ఇంటి బయటే ఉండి.. ఎవరూ లోపలికి రాకుండా చూసిందని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి రక్తపు మడుగులో ఉన్న బాధితురాలి మృతదేహాన్ని బ్లాంకెంట్‌లో చుట్టి.. బెడ్‌బాక్స్‌లో పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గదిని శుభ్రం చేసి.. వీలు చిక్కినపుడు నగర శివారు ప్రాంతానికి తీసుకువెళ్లి డిస్పోజ్‌ చేసేందుకు ప్రయత్నించారని, అది కుదరకపోవడంతో వకీల్‌ బిహార్‌కు పారిపోగా.. అతడిని అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు