పెళ్లికి నిరాకరించిందని ప్రేమోన్మాది దారుణం

9 May, 2021 03:04 IST|Sakshi

యువతిపై కత్తితో దాడి

గొంతు కోసుకొని ప్రేమోన్మాది మృతి 

జగిత్యాల జిల్లాలో ఘటన

సాక్షి, జగిత్యాల క్రైం: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌కు చెందిన యువతి(25), అదే గ్రామానికి చెందిన కట్కం రాజ్‌కుమార్‌ స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇంటర్‌ తర్వాత రాజ్‌కుమార్‌ ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. యువతి ఇక్కడే ఉంటూ పీజీ చేస్తోంది. వారిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. 

యువతి మెడకు తగిలిన గాయం 

ఇరవైరోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చి...
ఇరవై రోజుల క్రితం రాజ్‌కుమార్‌ దుబాయ్‌ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. యువతిని కలిసేందుకు అతడు విఫలయత్నం చేశాడు. ఫోన్‌ చేసినా సరిగా స్పందించకపోవడమేకాకుండా తనతో పెళ్లికి నిరాకరించిందని కోపం పెంచుకున్నాడు. ఆగ్రహంగా ఉన్న రాజ్‌కుమార్‌ శనివారం మధ్యాహ్నం జాబితాపూర్‌కు చేరుకున్నాడు. యువతి ఇంట్లోకి వెళ్లి కత్తితో ఆమె మెడ, వీపుపై దాడి చేశాడు. యువతి తప్పించుకొని, కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చేసరికి అతడు అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు.

స్థానికుల సమాచారం మేరకు జగిత్యాల  రూరల్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రాజ్‌కుమార్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన యువతి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడి సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, కాల్‌డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

నమ్మలేకపోతున్నాం...
రాజ్‌కుమార్‌ మృతితో మేడిపల్లి మండలం మన్నెగూడెంలో విషాదం నెలకొంది. అందరితో కలిసిమెలిసి ఉండే యువకుడు క్షణికావేశానికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దీనిని తాము నమ్మలేకపోతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. రాజ్‌కుమార్‌కు ఒక సోదరి ఉంది. ఆమె వివాహం కాగా, తల్లిదండ్రులకు అతడు ఒక్కగానొక్క కొడుకు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు