ఆర్డీవో నరేందర్‌ ఆచూకీ ఎక్కడ! 

23 Sep, 2020 10:34 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి:  ఇటీవల సస్పెండ్‌ అయిన కామారెడ్డి ఆర్డీవో నరేందర్‌ వారం రోజులుగా కనిపించడం లేదు. ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తునట్లు తెలిసింది.  
సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో జిన్నారం మండలం కాజిపల్లిలో మాజీ సైనికుల పేర భూమి కేటాయించిన విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు నరేందర్‌పై ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. సస్పెండ్‌ చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన అరెస్ట్‌కాకుండా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది.  (అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ 'న‌గేష్' కేసులో మ‌హిళ పాత్ర)

ఆరోపణల వెల్లువ.. 
సంగారెడ్డి జిల్లాలో భూ అక్రమాల్లో సస్పెండ్‌ అయిన తరువాత నరేందర్‌పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కామారెడ్డి ఆర్డీవోగా ఆయన మూడు నెలలు పనిచేశారు. ఈ మూడు నెలల్లోనే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భిక్కనూరు మండలం జంగంపల్లి, బస్వాపూర్‌ గ్రామాల పరిధిలో పలు భూ వివాదాల్లో తలదూర్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా జంగంపల్లి శివారులో ప్రభుత్వ భూములను నిబంధనలను విరుద్ధంగా కట్టబెట్టే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. గతంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌గా కామారెడ్డి ప్రాంతంలో చాలా కాలం పనిచేసిన నరేందర్‌కు ఇక్కడి భూములపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ఆయన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే భూ వివాదాల్లో తలదూర్చారని ఆరోపణలు వస్తున్నాయి. (ఆ ముగ్గురు ఎక్కడ?..)

మరిన్ని వార్తలు