గత ఏడాది భారీగా పెరిగిన డిజిటల్‌ మోసాలు

30 Apr, 2021 14:35 IST|Sakshi

ట్రాన్స్‌యూనియన్‌ నివేదిక  

ముంబై: భారత్‌ను కేంద్రంగా చేసుకుని డిజిటల్‌ లావాదేవీల ద్వారా వ్యాపార సంస్థలను మోసం చేసే ఉదంతాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఇలాంటి సందేహాస్పద యత్నాలు 28 శాతం పెరిగినట్లు ట్రాన్స్‌యూనియన్‌ వెల్లడించింది. ఈ తరహా కేసులు అత్యధికంగా ముంబైలో ఉండగా.. ఢిల్లీ, చెన్నై తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘మోసగాళ్లు సాధారణంగా చెప్పుకోతగిన ప్రపంచ పరిణామాల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. కోవిడ్‌-19 మహమ్మారి, డిజిటల్‌ వినియోగం పెరగడం ఈ ఆన్‌లైన్‌ యుగంలో కీలక పరిణామంగా మారింది. మోసగాళ్లు దీన్నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు‘ అని ట్రాన్స్‌యూనియన్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షాలీన్‌ శ్రీవాస్తవ తెలిపారు. 

2021 మార్చి 10 నాటికి కోవిడ్‌-19ని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి ఏడాది పూర్తయ్యింది. అంతక్రితం ఇదే వ్యవధితో పోలిస్తే డిజిటల్‌ మోసాల ప్రయత్నాలు 28 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 40,000 పైగా అంతర్జాతీయ వెబ్‌సైట్లు, యాప్స్‌పై జరిగిన వందల కోట్ల లావాదేవీల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు. లాజిస్టిక్స్‌ రంగంలో మోసాల యత్నాలు అత్యధికంగా 224 శాతం మేర పెరగ్గా, టెలికం (200 శాతం), ఆర్థిక సేవలు (89 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తుల డెలివరీని దారి మళ్లించడం ద్వారా మోసగించే ప్రయత్నాలు ఎక్కువగా జరిగాయి. బీమా, గేమింగ్, రిటైల్, పర్యాటకం వంటి విభాగాల్లో మాత్రం ఇలాంటి ఉదంతాలు కొంత తగ్గాయి.

చదవండి:

65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు!

>
మరిన్ని వార్తలు