ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే.. సీఎం మమతా బెనర్జీ మద్దతు

19 Dec, 2023 17:40 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్షాల ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా కూటమి భేటీ ముగిసింది. 

పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ ఇండియా కూటమి తీర్మానం చేసింది. ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా డిసెంబర్ 22న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 8-10 సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయని ఖర్గే తెలిపారు. సీట్ల సర్దుబాటు గురించి రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని నేటీ సమావేశంలో నిర్ణయం తీసుక్నునారు. రాష్ట్రస్థాయిలో సీట్ల సర్దుబాటు కుదరకపోతే ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఏకాభిప్రాయానికి వచ్చామని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి కన్నా.. ముందు గెలవడం ముఖ్యమని ఖర్గే అన్నారు. గెలిచిన తరువాత ప్రధాని ఎవరనేది ఎంపీలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఇండియా కూటమి నాలుగోసారి నేడు సమావేశమైంది. సీట్ల పంపకం, ఉమ్మడి ప్రచార అజెండాతో సహా వివిధ అంశాలపై చర్చించడానికి ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న కీలక విపక్ష నేతలు హాజరయ్యారు. 

ఈ భేటీ డిసెంబర్ 6నే జరగాల్సి ఉండగా.. కీలక నేతల గౌర్హాజరు కారణంగా డిసెంబర్ 17కు వాయిదా పడింది. డిసెంబర్ 17 నుంచి మళ్లీ నేటికి వాయిదా పడింది. డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై 141 మంది ఎంపీలు సస్పెండ్ అయిన తరుణంలో విపక్షాల నాలుగో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి: 'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్ష ఎంపీ మిమిక్రి

>
మరిన్ని వార్తలు