రెచ్చిపోయిన ఇసుక స్మగ్లర్లు

28 Jul, 2021 01:23 IST|Sakshi
ఇసుక ట్రాక్టర్లను తరలిస్తున్న పోలీసులు , గాయపడ్డ శ్రీనివాస్‌ , రాజ్‌కుమార్‌

ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై రాళ్లు, కర్రలతో దాడి 

జగిత్యాల జిల్లా వేంపల్లిలో ఉద్రిక్తత   

మల్లాపూర్‌ (కోరుట్ల): ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో స్మగ్లర్లు ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. రాళ్లు, కర్రలు, పారలతో ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని వేంపల్లి శివారు పెద్దవాగులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రాయికల్‌ మండలం కొత్తపేట వడ్డెర కాలనీ గ్రామానికి చెందిన కొందరు వేంపల్లి పెద్దవాగులోంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు మూడు, నాలుగు రోజులుగా యత్నిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి 20 ట్రాక్టర్లలో,  సుమారు 60 మందికి పైగా స్మగ్లర్లు పెద్దవాగులోకి చేరుకుని ఇసుకను తోడుతున్నారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఎస్సై వెంకటేశ్, పోలీస్‌ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజ్‌కుమార్‌ అక్కడకు వెళ్లి రవాణాకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో సుమారు 40 మందికి పైగా దుండగులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ రాళ్లు, కర్రలు, పారలతో దాడికి తెగబడ్డారు.

ఈ ఘటనలో ట్రైనీ ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో మెట్‌పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ శ్రీనివాస్, సబ్‌డివిజన్‌ పరిధిలోని ఎస్సైలు, పోలీసులతో వేంపల్లికి చేరుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుళ్లకు వైద్యసేవలు అందించారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా పోలీసులపై దాడి చేసిన 24 మందిపై కేసు నమోదు చేశామని, 10 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ట్రైనీ ఎస్సైపై దాడి జరగలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు దాడి చేసి గాయపరిచారని సీఐ వివరించారు.  

మరిన్ని వార్తలు