‘సంకల్ప’ స్కాం 

24 Nov, 2022 04:22 IST|Sakshi
సీతారాంపురంలోని సంకల్ప సిద్ధి కార్యాలయం

బెజవాడలో బోర్డు తిప్పేసిన చెయిన్‌ లింక్‌ సంస్థ 

యాప్‌ ద్వారా రూ.కోట్లలో వసూలు 

తెలుగు రాష్ట్రాల్లో వేల మంది బాధితులు 

కేసు నమోదు.. పోలీసుల అదుపులో నిందితులు!  

ఒకటికి పది రెట్లిస్తాం.. డబ్బులే డబ్బులు!! బంగారం.. స్థలాలు.. కట్టిన సొమ్మంతా తిరిగిస్తాం... ఎర్ర చందనం మొక్కలతో చెట్లకు డబ్బులు కాయిస్తాం!! తెలిసిన వారిని చేరిస్తే కమీషన్‌ కూడా ఇస్తాం.. మీరు మునగండి.. మీ పక్కవారినీ ముంచండి! యాప్‌లో ఒకరి తరువాత ఒకరుగా మోసపోయిన గొలుసు కట్టు గోల్‌మాల్‌ బాగోతమిదీ.. 
– సాక్షి ప్రతినిధి, విజయవాడ

యాప్‌ ద్వారా.. 
విజయవాడలో సంకల్ప సిద్ధి మార్ట్‌ పేరుతో ఏర్పాటైన చెయిన్‌ లింక్, మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థ మోసాలు బహిర్గతమయ్యాయి. సీతారాంపురంలోని దుర్గా అగ్రహారంలో ఏడాది క్రితం ఓ అద్దె ఇంట్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ యాప్‌ ద్వారా రూ.కోట్లలో డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. పది రోజులుగా యాప్‌ పని చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వేల సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం.  

ఐదు రకాల స్కీంలతో చెయిన్‌ చీటింగ్‌ 
► సంకల్పసిద్ధి సంస్థ నిర్వాహకులు సభ్యత్వం కోసం రూ.3 వేలు చొప్పున బాధితుల నుంచి వసూలు చేసి నమ్మకం కలిగించేందుకు సరుకులు ఇచ్చారు. రోజుకు రూ.10 చొప్పున 300 రోజుల్లో కట్టిన డబ్బంతా వెనక్కు వస్తుందని నమ్మించారు.  

► రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున 300 రోజుల్లో రూ.3 లక్షలు ఇస్తామనేది రెండో స్కీం  

► రూ.లక్ష నగదు చెల్లిస్తే లక్ష విలువైన బంగారం ఇవ్వడంతో పాటు రోజుకు రూ.100 చొప్పున 300 రోజుల్లో రూ.30 వేలు ఇస్తామని మూడో స్కీం ద్వారా ఆశ చూపారు.  

► రూ.2.5 లక్షలు ఇస్తే 25 ఎర్ర చందనం మొక్కలతో కూడిన స్థలం ఇవ్వడంతోపాటు 15 ఏళ్లకు రూ.1.75 కోట్లు వస్తాయంటూ వసూళ్లకు పాల్పడ్డారు. 

► రూ.5 లక్షలు చెల్లిస్తే సెంటు భూమి ఇవ్వడంతోపాటు 300 రోజుల్లో తిరిగి రూ.2.5 లక్షలు చెల్లిస్తామని మరో ఎర వేశారు. 

పోలీసుల అదుపులో నిందితులు 
దుర్గా అగ్రహారం, బందర్‌ రోడ్డులోని కార్యాలయం, నిడమానూరులోని సంకల్పసిద్ధి మార్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంస్థకు చెందిన సాఫ్ట్‌వేర్‌ డేటాను సీజ్‌ చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బ్యాంకు లావాదేవీలను స్తంభింపజేసి రూ.2.5 కోట్ల నగదును సీజ్‌ చేశారు. సంస్థ చైర్మన్‌ గుత్తా వేణుగోపాల్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

న్యాయం చేస్తాం.. 
చట్టపరమైన చర్యలు తీసుకొని సంకల్ప సిద్ధి డిపాజిటర్లకు న్యాయం జరిగేలా చూస్తాం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.  
– టి.కె.రాణా, సీపీ 

మరిన్ని వార్తలు