విషాదం: ఇంటి మిద్దెకూలి మనవడితో సహా సర్పంచ్ మృతి

23 Jun, 2021 15:10 IST|Sakshi

సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండ రావిపాకుల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి మిద్దెకూలి గ్రామ సర్పంచ్‌ లచ్చమ్మ (51), ఆమె మనవడు యోగేశ్వర్ (7)  మృతి  చెందారు. మంగళవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మిద్దెకూలిపోయి వారిపై పడింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కాగా, బండ రావిపాకుల.. ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో చాలా రోజులుగా పునరావాసం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు, ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో అదే ఇళ్లలో ఉంటున్నారు. ఈక్రమంలో సర్పంచ్‌ ఇళ్లు పాతదై పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

 

ఆర్టీఓ,తహసీల్దార్లతో గ్రామస్తుల  వాగ్వివాదం
గ్రామ సర్పంచ్ మృతి చెందిన విషయం తెలియడంతో ఆర్టీఓ, తహసీల్దార్‌ బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు బండ రావిపాకుల వెళ్లారు. అయితే, ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రాణాలు బలయ్యాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఓ, తహసీల్దార్లను అడ్డుకున్నారు. ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. తమకు సకాలంలో పునరావాసం ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి పరిస్దితి తలెత్తేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులంతా పునరావాస పరిహారంపై పట్టుబట్టడంతో ఆర్టీఓ, తహసీల్దార్లు వెనుదిరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

చదవండి: కేపీహెచ్‌బీకాలనీ: అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం

మరిన్ని వార్తలు