నువ్వంటే క్రష్‌.. ‘ఓయో’లో కలుద్దామా: ఉద్యోగినికి బాస్‌ వేధింపులు

1 Sep, 2021 13:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు, చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాల నివారణకు సైబరాబాద్‌ పోలీస్‌ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ పరిధిలో ఉద్యోగినులు కూడా వేధింపులకు గురవుతున్నాయి. తమ భవిష్యత్‌... సమాజంలో గౌరవం వంటి విషయాలతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. అలాంటి వారి కోసం వాట్సప్‌ నంబర్‌తో ఫిర్యాదు స్వీకరించేందుకు సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. ఆ వాట్సప్‌కు స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో వాట్సప్‌కు వచ్చిన ఫిర్యాదు చూస్తుంటే పని ప్రాంతాల్లో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను కూడా సైబరాబాద్‌ మహిళ, చిన్నారుల రక్షణ వింగ్‌ ట్విటర్‌లో బహిర్గతం చేసింది.

ఓ ఉద్యోగినికి వాట్సప్‌లో ఆమె బాస్‌ మెసేజ్‌ చేశాడు. హలో.. అంటూ ప్రాజెక్ట్‌ వర్క్‌పై మాట్లాడాడు. నీ పర్ఫామెన్స్‌ పూర్‌గా ఉందని చెప్పాడు. దీంతో ఆమె లేదు సార్‌ మొత్తం నేనే చేశానని చెప్పగా కాదు అని చెప్పాడు. దీంతో భయాందోళనకు గురయిన ఆమె నా భవిష్యత్‌ అంటూ వాపోయింది. హేం కంగారొద్దు.. నీకు ప్రమోషన్‌, జీతం పెంపు చేస్తా అని వరాలు కురిపించి కానీ అని గ్యాప్‌ ఇచ్చాడు. ఆ ‘కానీ’లో ఎంతో దురుద్దేశం దాగి ఉంది. (చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ)

కానీ ఏంటి సార్‌ అని అడగా అతడి వక్రబుద్ధి బయటపడింది. ఆమెను ఓయో రూమ్‌లో కలుద్దామని అడిగాడు. దీంతోపాటు మొదటి నుంచి నీపై క్రష్‌ ఉందని చెప్పాడు. దీనికి ఆ యువతి ‘క్షమించండి సార్‌’ అనగా సరే ‘నీ ప్రమోషన్‌, జీతం పెంపు విషయంలో కూడా సారీ’ అని ఆ బాస్‌ చెప్పేశాడు. అతడి స్పందనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ బాధితురాలు ‘నీ కెరీర్‌ను కాపాడుకో’ అంటూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2003 కింద కేసు నమోదు చేశా అని సమధానం చెప్పింది. అయితే అతడి వేధింపులు ఎప్పటి నుంచో ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే అతడి పేరు డైనో‘సార్‌’ అని పెట్టుకోవడం చూస్తుంటే అర్థమవుతోంది. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?)

ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ మహిళలకు కార్యాలయాల్లో కూడా భద్రత లేదని అర్థమవుతోంది. ‘నేను కూడా అలాంటి వాడిని కాదు. బట్‌.. నువ్వంటే క్రష్ ఉంది నాకు... ఫ్రమ్‌ ద ఫస్ట్‌ డే’ అని సైబరాబాద్‌ మహిళా, శిశు రక్షణ వింగ్‌ తన ఖాతాలో పోస్టు చేసింది. అయితే ఆ స్క్రీన్‌ షాట్‌ నిజమైన ఫిర్యాదా? లేక అవగాహన కల్పించేందుకు చేసిన చిత్రమా? అనేది తెలియలేదు. ఒకవేళ ఫిర్యాదు అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించలేదు. మహిళలను అప్రమత్తం.. అవగాహన కల్పించేందుకు సృష్టించిన చాటింగ్‌లా కనిపిస్తోంది. ఏది ఏమున్నా మహిళలు మీ రక్షణకు పోలీసులు ఉన్నారనే విషయం మరచిపోకండి. వేధింపులు ఎదుర్కొంటుంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతే ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. మీ వివరాలను గోప్యంగా ఉంచుతారు.
 

మరిన్ని వార్తలు