రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా.. లారీ టైర్‌ మారుస్తుండగా..!

19 Jul, 2022 01:53 IST|Sakshi
రెండు క్రేన్‌ల సహాయంతో లారీ కింది నుంచి ఆటోను బయటకు తీస్తున్న పోలీసులు 

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి మృత్యువాత 

కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో ఘటనలు

మద్నూర్‌/బాల్కొండ: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు, నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వీరిలో ఒక ఇంటర్‌ విద్యార్థి ఉన్నాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ నుంచి ఆటో రాంగ్‌రూట్‌లో మేనూర్‌ వద్ద 161వ జాతీయ రహదారిపైకి వెళ్లగా, అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌ వైపు లారీ ఎదురుగా వస్తోంది.

అదుపుతప్పిన ఆటో లారీ కిందకి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయ్యింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురి శరీర భాగాలు చితికిపోయాయి. పోలీసులు వచ్చి రెండు క్రేన్ల సహాయంతో లారీని పైకి లేపి ఆటోను బయటకు లాగారు. అందులోని ఐదుగురి శవాలను బయటకు తీశారు. మృతుల్లో ఒకరు మద్నూర్‌ మండలం మేనూర్‌కు చెందిన ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి బోయిన్‌వార్‌ క్రిష్ణ(17), మహారాష్ట్రకు చెందిన మహాజన్‌ భుజంగ్‌(55), నిజామాబాద్‌ జిల్లా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన బొలిశెట్టి లింబన్న(48), రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం జాలపల్లి శ్రీరాంకాలనీకి చెందిన షేక్‌ ముజీబ్‌(19)గా గుర్తించారు.

మరొకరిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై రాకపోకలు దాదాపు గంటపాటు నిలిచిపోయాయి. కాగా, ప్రమాదానికి కారణమైన ఆటో సోమవారం తెల్లవారు జామున నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రం నుంచి చోరీకి గురి అయింది కావడం గమనార్హం.

రోడ్డుపై లారీ టైర్లు మారుస్తుండగా... 
ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌ వైపు హరియాణాకు చెందిన లారీ కొబ్బరి బొండాల లోడుతో వెళ్తుండగా నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌ శివారు లో 44వ జాతీయ రహదారిపై టైర్‌ పంక్చర్‌ అయింది. నడిరోడ్డుపై లారీని నిలిపి ఎలాంటి సిగ్నల్‌ వేయకుండానే డ్రైవర్‌ రాబిన్‌ఖాన్‌(25) టైరు మారుస్తుండగా వెనుక నుంచి వచ్చిన కంటైన ర్‌ వేగంగా ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కంటైనర్‌ డ్రైవర్‌ రస్మోద్దీన్‌ ఖాన్‌(20) తీవ్రగాయాలై అందులోనే ప్రాణా లు విడిచాడు. కంటైనర్‌ క్లీనర్‌ ఖుర్షీద్‌కు తీవ్రగాయాలు కాగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ప్రమాదం కారణంగా జాతీయరహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాటిని దారి మళ్లించారు. లారీలో ఉన్న మరో డ్రైవర్‌ తారీఫ్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు