ఇందూరుకు ఇవి కావాలి

10 Nov, 2023 02:34 IST|Sakshi

పీపుల్స్‌ మేనిఫెస్టో 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్‌ నగరంలో 4,70,152 మంది జనాభా ఉన్నారు. ఇందులో 2,86,766 మంది ఓటర్లు ఉన్నారు. నగరం వేగంగా విస్తరిస్తున్నా ఆ మేరకు సౌకర్యాల కల్పన మాత్రం జరగడం లేదన్న వాదనలున్నాయి. ఇక్కడ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, ముంపు సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల డిమాండ్లు ఇలా ఉన్నాయి. 

బస్తీ దవాఖానాల సేవలు అంతంతే.. 
నిజామాబాద్‌లో బస్తీ దవాఖానాలు  సేవలు నామమాత్రమే. నగరంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నప్పటికీ సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. సేవలను మెరుగుపరచాలి. 

 భూగర్భ డ్రైనేజీ పనులకు మోక్షం ఎప్పుడు 
నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఇటీవల పనులు పూర్తయినా, మురుగునీరు ఇళ్ల నుంచి వెళ్లడానికి కనెక్షన్లు  ఇవ్వలేదు. నగరం విస్తరించిన నేపథ్యంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని ఇతర ప్రాంతాలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

‘నుడా’ పరిధిలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి 
 నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) పరిధిలోని డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌ వద్ద లేదా జానకంపేట రైల్వేస్టేషన్‌ వద్ద 50 ఎకరాల్లో డ్రైపోర్టు  ఏర్పాటు చేసేందుకు కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసింది. డ్రైపోర్టు ఏర్పాటైతే ఇక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఎగుమతి చేయవచ్చని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఛాంబర్‌ ఆప్‌ కామర్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎకానమీ సైతం పెరుగుతుందంటున్నారు. 

ముంపు సమస్య నివారించాలి 
నగరం మధ్యలో ప్రవహిస్తున్న పులాంగ్‌ వాగు ఆక్రమణల కారణంగా ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. రామర్తి చెరువు 70 శాతం ఆక్రమణకు గురైంది. దీంతో బోధన్‌ రోడ్డుకు ఇరువైపులా వర్షాకాలంలో ముంపు తప్పడం లేదు. న్యాల్‌కల్‌ రోడ్డు లోని రోటరీనగర్‌ ముంపునకు గురవుతోంది. నగరం విస్తరించిన నేపథ్యంలో భూగర్భ డ్రైనేజీ విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కోరుతున్నారు. 

అంతర్గత రోడ్లు అధ్వానం.. 
కార్పొరేషన్‌ పరిధిలో ప్రధాన రోడ్లు మాత్రమే బాగున్నాయి. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లను నిర్మించాలన్న డిమాండ్లున్నాయి. 

ఒక్క సర్కారీ ఇంజనీరింగ్‌ కళాశాల కూడా లేదు 
నగరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల లేదు. ఇక నగరానికి సమీపంలో తెలంగాణ వర్సిటీ ఉన్నా,  దీని పరిధిలోనూ ఇంజనీరింగ్‌ కళాశాల లేదు. తెలంగాణ వర్సిటీలో కోర్సులు పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు