శ్రద్ధ హత్య కేసు.. నేరం అంగీకరించని అఫ్తాబ్.. పోలీస్‌ కస్టడీ పొడిగింపు

22 Nov, 2022 14:25 IST|Sakshi

న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది ఢిల్లీ కోర్టు. ఈ కేసులో ఇంకా కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోరడంతో అంగీకరించింది. సాకెత్ కోర్టులో మంగళవారం విచారణ సందర్భంగా ఈ ఘటన క్షణికావేశంలోనే జరిగిందని అఫ్తాబ్ కోర్టుకు చెప్పాడు.

విచారణ అనంతరం అఫ్తాబ్ తరఫు న్యాయవాది అవినాశ్‌ మాట్లాడుతూ.. అతడు ఇంకా కోర్టులో నేరాన్ని అంగీకరించలేదని పేర్కొన్నాడు. ఘటన సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు కూడా న్యాయస్థానం ఎదుట ఒప్పుకోలేదని వివరించాడు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు అతడ్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.

మరోవైపు అఫ్తాబ్‌కు ఐదు రోజుల్లో నార్కో టెస్టు నిర్వహించాలని గత సెషన్‌లో కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అతను విచారణకు సహకరించడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అందుకే నార్కో టెస్టుకు ముందు పాలీగ్రాఫ్‌ టెస్టు నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టును కోరారు.

శ్రద్ధ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ బాయ్ ఫ్రెండ్ అఫ్తాబే ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. అయితే ఈ కేసులో అఫ్తాబ్ ఉపయోగించిన కత్తి, శ్రద్ధ దుస్తులు, మొబైల్ ఫోన్, ఇంకా కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.
చదవండి: అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకున్న మహిళా పోలీస్‌..

మరిన్ని వార్తలు