రాంగ్‌.. సిగ్నల్స్‌..

24 Jul, 2020 07:30 IST|Sakshi

కరావళిలో శాటిలైట్‌ ఫోన్ల వాడకం 

కేంద్ర నిఘా సంస్థల విచారణ 

బనశంకరి: కరావళిలో ఉగ్రవాద స్లీపర్‌సెల్స్‌ చడీచప్పుడు లేకుండా తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి బలపడేలా నిషేధిత శాటిలైట్‌ ఫోన్లు పనిచేస్తున్నట్లు వెలుగుచూసింది. వీటిని ఎవరు వాడుతున్నారా అని కేంద్ర సంస్థలు ఆరా తీస్తున్నాయి. దేశంలో సాధారణ పౌరులు శాటిలైట్‌ ఫోన్ల వాడకంపై నిషేధం ఉంది. ఉగ్రవాద వర్గాలు ఇతర దేశాల్లో ఉండే సహచరులతో రహస్య సంభాషణలకు ఈ ఫోన్లను ఉపయోగిస్తుంటాయి.  

ఎక్కడెక్కడ జరిగాయి  
గత మూడు రోజుల క్రితం దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేళాలు, 15 రోజుల క్రితం బెళ్తంగడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిల్లూరు, కార్కళ, బజగూళి ప్రాంతాల్లో అప్పుడప్పుడు శాటిలైట్‌ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిగాయని జాతీయ నిఘా సంస్థలు ఐబీ, రా గుర్తించాయి. కొరియా దేశ తురాయా బ్రాండ్‌ శాటిలైట్‌ ఫోన్‌ యాక్టివేట్‌ కాగా గత 6 రోజుల్లో రెండుసార్లు శాటిలైట్‌ ఫోన్‌లో మాటామంతీ జరిగాయి. దీనికి సంబంధించి అంతర్గత భద్రతా విభాగాల అధికారులు విచారణ చేపడుతున్నారు. 2019 జూన్‌ నుంచి ఆగస్టు మధ్యలో బెళ్తంగడి తాలూకాలోని గోవిందూరిలో ఇలాంటి సంఘటనే జరిగింది. 2008 ముంబై దాడి సమయంలో ఉగ్రవాదులు తురాయా శాటిలైట్‌ ఫోన్లను వినియోగించారు. ఈ దాడి తరువాత భారతదేశ వ్యాప్తంగా ఆ శాటిలైట్‌ ఫోన్లను నిషేధించారు. ప్రస్తుతం మళ్లీ తెరమీదకు రావడంతో నిఘా సంస్థలు విచారణ చేపట్టాయి. 

మరిన్ని వార్తలు