కన్నతల్లితో మరో వ్యక్తి సహజీవనం.. సన్నిహితంగా నటించి 

23 Jan, 2023 08:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన  మేడ్చల్‌ జిల్లాలోని మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ  గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా తెలప్రోలు గ్రామానికి చెందిన వివాహితకు, కోల వెంకటరమణమూర్తి (47) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో అక్కడి నుంచి 14 ఏళ్ల క్రితం సదరు మహిళ కుటుంబ సభ్యులను వదిలి నగరాని వచ్చింది.

పీర్జాదిగూడ బీబీసాహెబ్‌ మక్తా అమృత కాలనీలోని వృద్ధాశ్రమంలో వెంకటరమణమూర్తి కేర్‌ టేకర్‌గా పనిచేస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ద్వారా తన తల్లి చిరునామా తెలుసుకున్న ఆమె కుమారుడు నగరానికి వచ్చాడు. వెంకటరమణమూర్తికి నచ్చజెప్పి ఆమెను ఊరికి తీసుకువెళ్లాడు. వెంకటరమణమూర్తి కొన్ని రోజులుగా ఆమెకు ఫోన్‌ చేస్తూ నగరానికి రావాలంటూ పట్టుబడుతున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన తన తల్లి మళ్లీ దూరమవుతుందనే ఆలోచన అతడిలో మొదలైంది.

దీంతో నెల రోజుల క్రితం నగరానికి వచ్చి వెంకటరమణమూర్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు నటించాడు. ప్రణాళిక ప్రకారం ఆదివారం మధ్యాహ్నం వెంటకరమణమూర్తి వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. అక్కడే ఉన్న 5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌తో వెంకటరమణమూర్తి తల, పక్కటెముకలపై దాడి చేయడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు.

అదే సమయంలో సిలిండర్‌ కింద విసిరేసినట్లు శబ్దం రావడంతో ఇంటి యజమాని కొడుకు పైకి వెళ్లి చూశాడు. అప్పటికే వెంకటరమణమూర్తి రక్తపు మడుగులో ఉన్నాడు. నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేసి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు