ఫోర్జరీ ఖరీదు రూ.30 లక్షలు!

30 Oct, 2021 05:13 IST|Sakshi

నకిలీ లేఖలు, ఎఫ్‌డీలపై మదన్‌ ఫోర్జరీ సంతకాలు  

‘తెలుగు అకాడమీ’ కేసులో గుర్తించిన సీసీఎస్‌ 

షిర్టీలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించిన అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీకి సంబంధించిన రూ.64.5 కోట్లు కాజేయడానికి పథకం వేసిన సూత్రధారి సాయికుమార్‌ అందుకు నకిలీ లేఖలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) బాండ్లు వినియోగించాడు. వీటిని తమిళనాడుకు చెందిన పద్మనాభన్‌ తయారు చేయగా.. అకాడమీ, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసింది మాత్రం మదన్‌ అని తేలింది. దీని నిమిత్తం ఇతడికి కుంభకోణం సొమ్ము నుంచి రూ.30 లక్షలు ముట్టింది.

సాయి అనుచరుడు వెంకట రమణకు స్నేహితుడైన ఇతడిని కేసు దర్యాప్తు అధికారి కె.మనోజ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం గురువారం షిర్డీలో అరెస్టు చేసి శుక్రవారం నగరానికి తరలించింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది. ఏపీ పోలీసులు అరెస్టు చేసిన యోహాన్‌ రాజును పీటీ వారెంట్‌పై తీసుకురావాల్సి ఉంది.   

టెన్త్‌ చదివిన మదన్‌ ఫోర్జరీలో దిట్ట 
మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన మదన్‌ పదో తరగతి వరకు చదివాడు. ఆపై అక్కడే వ్యవసాయం చేసేవాడు. 2019లో వెంకటరమణ షిర్డీ వెళ్లినప్పుడు ఇతడితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి రాకపోకలు, సంప్రదింపులు కొనసాగాయి. సంతకాలను ఫోర్జరీ చేయడంలో మదన్‌కు పట్టుండటంతో వెంకటరమణ అతన్ని సాయికి పరిచయం చేశాడు. తెలుగు అకాడమీ డబ్బు వివిధ బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయడానికి సాయి తన అనుచరులైన సోమశేఖర్‌ తదితరులను దళారుల అవతారం ఎత్తించాడు.

డబ్బు కాజేయాలని ముందే పథకం వేసిన సాయి.. అకాడమీ నుంచి తన అనుచరుల ద్వారా ఆ మొత్తాలకు సంబంధించిన చెక్కులు, కవరింగ్‌ లెటర్లను తీసుకున్నాడు. తొలుత లేఖల్లో ఎఫ్‌డీ కాలాన్ని మారుస్తూ నకిలీవి సృష్టించాడు. వీటిని అకాడమీ ఇచ్చిన చెక్కులతో జత చేసి బ్యాంకుల కు పంపించాడు. ఈ లేఖల్లో సదరు మొత్తాన్ని 5 రోజుల నుంచి వారానికే ఎఫ్‌డీ చేయాలని కోరేవాడు. బ్యాంకులు ఈ కాలానికి ఎఫ్‌డీ చేస్తూ దానికి సంబంధించిన బాండ్లు అందించేవి. వీటిని తీసుకుని సాయి అనుచరులు కొండాపూర్‌లోని అడ్డాకు చేర్చేవాళ్లు.

ఎఫ్‌డీల ఆధారంగా పద్మనాభన్‌ కంప్యూటర్‌ సాయంతో నకిలీవి తయారు చేసి ప్రింట్‌ తీసేవాడు. నకిలీ కవరింగ్‌ లెటర్లపై అకాడమీ అధికారుల సంతకాలు, నకిలీ ఎఫ్‌డీలపై బ్యాంకు అధికారుల సంతకాలను మదన్‌ ఫోర్జరీ చేసేవాడు. నకిలీ ఎఫ్‌డీలను అకాడమీకి ఇచ్చి 5 రోజులో, వారం రోజులో గడువు ముగిసిన తర్వాత తమ వద్ద ఉన్న ఒరిజనల్‌ ఎఫ్‌డీలు రద్దు చేసేవారు. కేవలం తెలుగు అకాడమీ కుంభకోణంలోనే కాకుండా ఏపీలో చోటు చేసుకున్న రెండు స్కాముల్లోనూ సాయి తదితరులతో పాటు మదన్‌ నిందితులుగా ఉన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఏపీ ఆయిల్‌ ఫెడ్, ఏపీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్ల నుంచీ సాయి గ్యాంగ్‌ రూ.14.6 కోట్లు కాజేశారు. అక్కడా నకిలీ లేఖలు, బాండ్లను పద్మనాభన్‌ తయారు చేయగా... బ్యాంకు, అధికారుల సంతకాలను మదన్‌ ఫోర్జరీ చేశాడని తేలింది. ఇతడిని సీసీఎస్‌ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు