కోళ్ల చోరీకి వచ్చాడని యువకుడిపై దాడి 

19 Sep, 2022 05:17 IST|Sakshi

ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు మృతి  

నూజివీడు: కోడి పుంజులను దొంగిలించడానికి వచ్చాడనుకుని ఓ యువకుడిని చితకబాదడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందాడు. ఏలూరు జిల్లా నూజివీడులో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నూజివీడులోని పాతపేటకు చెందిన సయ్యద్‌ గయాజుద్దీన్‌ ఎమ్మార్‌ అప్పారావు కాలనీ వద్ద కోడి పుంజులను పెంచుతున్నాడు.

అక్కడికి అదే కాలనీకి చెందిన లాకే అవినాష్‌ (22)  శనివారం అర్ధరాత్రి వెళ్లాడు. దీంతో అతను కోడి పుంజులను దొంగిలించడానికి వచ్చాడనుకుని గయాజుద్దీన్‌ పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఆ తర్వాత తన స్నేహితులకు ఫోన్‌ చేయగా, 10 మంది వచ్చారు. అందరూ కలిసి అవినాష్‌పై దాడి చేయగా అతడు స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం వారు అతని అన్నకు ఫోన్‌ చేసి.. మీ తమ్ముడిని తీసుకువెళ్లాలని చెప్పారు.

అవినాష్‌ అన్న అఖిలేష్‌ ఘటనాస్థలానికి చేరుకుని తమ్ముడిని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు పరీక్షించి అవినాష్‌ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. అఖిలేష్‌ ఫిర్యాదు మేరకు సీఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గయాజుద్దీన్,మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు