మామిళ్లపల్లి పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్‌

11 May, 2021 05:05 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

ఘటనపై సమగ్ర దర్యాప్తు 

వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

కడప అర్బన్‌: వైఎస్సార్‌ జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలో ముగ్గురాళ్ల క్వారీ వద్ద ఈనెల 8వ తేదీన జరిగిన పేలుడుకు సంబంధించి బాధ్యులైన లీజుదారుడు నాగేశ్వరరెడ్డి, ఎక్స్‌ప్లోజివ్‌ మేనేజర్‌ రఘునాథరెడ్డిలను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. కడపలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేలుడులో 10 మంది మృతిచెందారని, దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దర్యాప్తు అధికారిగా కడప ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌ను నియమించామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారిలో మేనేజర్‌ లక్ష్మిరెడ్డి కూడా ఉన్నట్లు తెలిపారు.

ముగ్గురి మృతదేహాలను ఇప్పటికే బంధువులకు అప్పగించామన్నారు. మిగిలిన మృతులను గుర్తించేందుకు నమూనాలను పరీక్షించేందుకు విజయవాడకు పంపించినట్లు తెలిపారు. ఇంకా ఈ కేసులో మైనింగ్‌ ఓనర్లకు, ఇతర బాధ్యులైనవారికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేసి, బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. మైనింగ్‌కు పర్యావరణ అనుమతులు, పేలుళ్లకు అనుమతులు లేవన్నారు. పేలుడు సమయానికి ముందు పులివెందుల నుంచి 20 బాక్స్‌లలో జిలెటిన్‌ స్టిక్స్, డిటోనేటర్లను కారులో తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) ఎం.దేవప్రసాద్, ఎస్‌బీ డీఎస్పీ బీవీ శివారెడ్డి పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు