కేసు నమోదు చేసిన చార్మినార్‌ పోలీసులు

8 Oct, 2020 08:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు.. 

సాక్షి, చార్మినార్‌ (హైదరాబాద్‌): సాక్షి దినపత్రిక ఫొటో జర్నలిస్టు గాలి అమర్‌పై బుధవారం సిటీ కాలేజీ చౌరస్తా వద్ద ఐదుగురు దుండగులు దాడి చేసి గాయపరిచారు. విధి నిర్వహణలో ఉన్న అమర్‌పై స్థానికులు అకారణంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. పేట్లబురుజు సిటీ కాలేజీ చౌరస్తా వద్ద సిగ్నల్స్‌ పనితీరు, వాహనాల రాకపోకలపై ఫొటోలు చిత్రీకరిస్తుండగా స్థానికంగా నివాసముంటున్న కొందరు అమర్‌ను అడ్డుకుని చితకబాదారు. కెమెరాతో పాటు సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. అక్కడి వాహనదారులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆగలేదు. చదవండి: మాజీ ఎమ్మెల్యే ‘వరద’ కుమారుడు, అల్లుడిపై కేసు

చార్మినార్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్‌ పోలీసు కానిస్టేబుల్‌ సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుల దాడి నుంచి ఫొటో జర్నలిస్టును కాపాడాడు. లాక్కున్న కెమెరాతో పాటు సెల్‌ఫోన్‌ను దుండగుల నుంచి తిరిగి ఇప్పించాడు. బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చార్మినార్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌కుమార్‌ తెలిపారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: ‘సాక్షి’ బాల ఎడిటర్లు 301 మంది

నిందితులపై చర్యలు తీసుకోవాలి.. 
‘సాక్షి’ఫోటో జర్నలిస్టు గాలి అమర్‌పై అకారణంగా దాడికి పాల్పడిన దుండగులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు సిరిగిరి విజయ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, జనరల్‌ సెక్రటరీ కేఎన్‌ హరి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగు వెంకటేశ్‌ గౌడ్, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్‌ దాడిని ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు