భగ్గుమన్న బెంగళూరు!

13 Aug, 2020 02:45 IST|Sakshi
బెంగళూరు అల్లర్లలో బుగ్గి అయిన వాహనాలు

పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి 

సోషల్‌ మీడియా పోస్ట్‌పై చెలరేగిన ఆందోళనలు

పీఎస్, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు

సాక్షి, బెంగళూరు: ప్రశాంతతకు పెట్టింది పేరుగా ఉండే కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసింది. పులకేశినగర  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడికి ప్రేరేపించింది. మంగళవారం సాయంత్రం  చిన్నపాటి గొడవగా ఆరంభమై రాత్రికి అల్లర్లు ఉధృతమయ్యాయి. వేల సంఖ్యలో జనాలు వచ్చి పోలీస్‌స్టేషన్, ఎమ్మెల్యే ఇంటిపై దాడులకు తెగబడ్డారు. గంటలపాటు విధ్వంసకాండ కొనసాగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు.

ఎమ్మెల్యే ఇంటిపై దాడి  
ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వ్యక్తి పులకేశినగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి సమీప బంధువు. ఎమ్మెల్యే అండతోనే అతడు ఇలా చేస్తున్నాడని భావించి మరో గుంపు కావల్‌ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేసింది. అక్కడి వాహనాలకు నిప్పు పెట్టగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఫైరింజన్లు  వెళ్లకుండా అడ్డుపడ్డారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు బెంగళూరు నగర కమిషనర్‌ కమల్‌పంత్‌ తెలిపారు. కాల్పుల్లో వాజిద్‌ ఖాన్‌ (20), యాసిమ్‌ పాషా (22), వాసిం (40) అనే వారు చనిపోయారు. దాడుల్లో 60 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. వివాదాస్పద పోస్టు పెట్టిన నవీన్‌ను, అల్లర్లకు పాల్పడిన మరో 110 మందిని అరెస్టు చేశారు.  ఈ సంఘటనలో ఎమ్మెల్యే  కుటుంబం క్షేమంగా బయటపడింది.  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం యెడియూరప్ప ఆదేశించారు.  అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి, సీఆర్‌పీఎఫ్‌ను మోహరించారు.

ఏం జరిగిందంటే?
శివాజీనగరకు చెందిన ఓ వర్గం వారు 15 మంది మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో డీజే హళ్లి పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లారు. మతపరమైన అంశాల్లో నవీన్‌ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కేశవమూర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేస్తామని చెప్పారు. అయితే తక్షణమే అరెస్టు చేయాలంటూ వాగ్వాదానికి దిగారు. అంతలోనే సుమారు 4 వేల మంది అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకుని, పలు వాహనాలకు నిప్పు పెట్టారు. స్టేషన్‌పై రాళ్లురువ్వారు. అర్థరాత్రి 2 గంటల తర్వాత కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అప్పటికే ఆ మార్గంలో 26 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 2 ఆటోలు, 3 కార్లు, 40 ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. ఆరంభంలోనే సీసీటీవీలు ధ్వంసం చేశారు. ఏటీఎం పగలగొట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా