Visa Scam: రూ.13 వేలు కడితే అమెరికా హెజ్‌1బీ వీసా..! ఇలాంటి స్కామర్లతో జర భద్రం..

23 Nov, 2022 07:45 IST|Sakshi

ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలతో మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ లింక్డ్‌ఇన్‌ యూజర్ స్కామర్లు వీసాలు ఇప్పిస్తామని రూ.లక్షలు కాజేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. అమెరికా హెచ్‌1బీ వీసా ఇప్పిస్తామని 160 డాలర్లు(రూ.13వేలు) కడితే దరఖాస్తు ప్రక్రియ మొదలు పెడుతామని సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నాడు. ఓ టాప్ సోడా కంపెనీల పేరుతో ఈ ఆఫర్ లెటర్‌ పంపుతున్నారని చెప్పాడు. మొదట రూ.13వేలే అని చెప్పినా ఆ తర్వాత ఆశావాహుల నుంచి లక్షలు కాజేస్తున్నారని వివరించాడు.

ఈ స్కామర్లు పంపే ఈ-మెయిళ్లు ప్రపంచంలోని టాప్‌ 500 కంపెనీల పేరుతో కూడా ఉంటాయని సదరు వ్యక్తి వివరించాడు. మీకు నమ్మకం కల్పించేందుకు వాళ్లు డమ్మీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నాడు. ఇలాంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. నిజంగా జాబ్ ఆఫర్ ఇచ్చే ఏ సంస్థ అయినా  డబ్బులు వసూలు చేయదు. కాబట్టి ఇలాంటి ఆన్‌లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని లింక్డ్ఇన్ యూజర్ సూచించాడు.
చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్‌, ఈ–కామర్స్‌ కంపెనీలు ఇలా చేయాల్సిందే!

మరిన్ని వార్తలు