నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.18 కోట్లు స్వాహా

9 Dec, 2021 05:47 IST|Sakshi

ముగ్గుర్ని అరెస్టు చేసిన విశాఖ సెంట్రల్‌ జీఎస్టీ అధికారులు 

సాక్షి, విశాఖపట్నం: నకిలీ ఇన్‌వాయిస్‌లతో కోట్లాది రూపాయల జీఎస్టీ క్రెడిట్‌ కొల్లగొట్టిన వ్యవహారాన్ని విశాఖపట్నం సెంట్రల్‌ జీఎస్టీ ఎగవేత–నిరోధక విభాగం బట్టబయలు చేసింది. వివరాలు.. విజయవాడకు చెందిన మదన్‌మోహన్‌రెడ్డి అనపర్తి కేంద్రంగా డ్యూడ్రాప్‌ గ్రానైట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కృష్ణసాయి బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీలు నిర్వహిస్తున్నాడు. రెండు కంపెనీలకు వేర్వేరు ఎండీలు, డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఒకే చిరునామా ఉండటంతో సెంట్రల్‌ జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే సోదాలు నిర్వహించగా.. కోట్లాది రూపాయల మోసం బట్టబయలైంది.

ఏ వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా.. వీటిని చెలామణి చేస్తున్నట్లు గుర్తించారు. సెంట్రల్‌ జీఎస్టీ అదనపు కమిషనర్‌ ఈదర రవికిరణ్‌ మాట్లాడుతూ.. నకిలీ జీఎస్టీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఇన్‌పుట్‌ క్రెడిట్‌ సొంతం చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు రూ.18 కోట్లకు పైగా జీఎస్టీ క్రెడిట్‌ బదిలీ అయినట్లు తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి మదన్‌మోహన్‌రెడ్డి సహా ముగ్గుర్ని జీఎస్టీ అధికారులు అరెస్టు చేసి.. విశాఖలోని ఆర్థిక నేరాల కోర్టులో బుధవారం హాజరుపరిచారు. మెజిస్ట్రేట్‌ 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించడంతో.. వీరిని విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు