వైజాగ్‌ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్

5 Aug, 2023 08:48 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు.

పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.
చదవండి: తహసీల్దార్‌ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య

కాగా, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్‌ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్‌ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు.

2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్‌(35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్‌ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది.

అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది.

రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్‌ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు.

ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్‌ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

తొలి నుంచి శివానీది నేర స్వభావమే..
రమేష్‌ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్‌ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్‌ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు