Electric Two-Wheeler Sales In July Cross 54,000 Units - Sakshi
Sakshi News home page

దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అమ్మకాల జోరు

Published Sat, Aug 5 2023 8:43 AM

Electric Two Wheeler Sales In July Cross 54,000 Units - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీ) జోరు కొనసాగుతోంది. 2023 జనవరి–జూలై మధ్య అన్ని విభాగాల్లో కలిపి రిటైల్‌లో 8,38,766 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 జనవరి–డిసెంబర్‌లో అమ్ముడైన మొత్తం యూనిట్లతో పోలిస్తే గడిచిన ఏడు నెలల విక్రయాల వాటా ఏకంగా 82 శాతం ఉంది.

జూలైతో ముగిసిన ఏడు నెలల అమ్మకాల్లో ఈ–టూ వీలర్లు 4,89,640 యూనిట్లు, ఈ–త్రీవీలర్లు 3,00,099, ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 46,164, సరుకు రవాణాకు ఉపయోగించే ఈ–వాహనాలు 1,603, ఈ–బస్‌లు 945, ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాలు 316 యూనిట్లు ఉన్నాయి. 2022 జనవరి–జూలైలో ఈ–టూవీలర్ల అమ్మకాలు 3,06,947 యూనిట్లు నమోదయ్యాయి. 2022లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, బస్‌లు కలుపుకుని 10,24,806 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి.  

జూలైలో 1,15,836.. 
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ రంగంలో 2023 జూలైలో దేశవ్యాప్తంగా రిటైల్‌లో అన్ని విభాగాల్లో కలిపి 1,15,838 యూనిట్లు  అమ్ముడయ్యాయి. ఈవీల విక్రయాలు లక్ష యూనిట్ల మార్కును దాటడం వరుసగా ఇది 10వ నెల. జూన్‌లో ఈ సంఖ్య 1,02,362 యూనిట్లు నమోదైంది. వాస్తవానికి జూన్‌ 1 నుంచి ఫేమ్‌–2 సబ్సిడీ తగ్గుతోందన్న కారణంగా మే నెలలో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లకు కస్టమర్లు అధికంగా ఉత్సాహం చూపించారు.

దీంతో మే నెలలో అన్ని విభాగాల్లో కలిపి 1,58,300 యూనిట్ల ఈవీలు అమ్ముడు కాగా, ఇందులో ఏకంగా 1,05,452 యూనిట్ల ఈ–టూ వీలర్లు ఉన్నాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఈ–టూ వీలర్లు 54,272 యూనిట్లు, ఈ–త్రీవీలర్లు 53,736 యూనిట్లు, ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 7,475 యూనిట్లు, గూడ్స్‌ వాహనాలు 219, ఈ–బస్‌లు 133 యూనిట్లు అమ్ముడయ్యాయి.  

Advertisement
Advertisement