వేధిస్తున్నాడని చంపేశారు.. 

7 Dec, 2021 12:50 IST|Sakshi
నిందితులు సరోజ, శ్రీను

సాక్షి, మీర్‌పేట(రంగారెడ్డి): వేధింపులకు గురిచేస్తున్నారని బావను హతమార్చిన అక్కాతమ్ముడిని మీర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ సత్యసాయినగర్‌ కాలనీకి చెందిన సభావత్‌ సరోజ, జరుప్లావత్‌ శ్రీను అక్కాతమ్ముడు. సరోజ భర్త కొంత కాలం క్రితం చనిపోయాడు. వీరిద్దరూ స్థానికంగా ఉన్న టైల్స్‌ షాపులో పనిచేస్తున్నారు.

చంపాపేట కృష్ణానగర్‌ కాలనీకి చెందిన కొడావత్‌ రెడ్యా (45) మొదటిభార్య చనిపోవడంతో పదేళ్ల క్రితం సరోజ, శ్రీనుల సోదరి అయిన లక్ష్మీని ఇచ్చి  వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెడ్యా కూడా టైల్స్‌ షాపులో పనిచేస్తుంటాడు.  రెడ్యా కొంత కాలంగా సరోజతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో రెడ్యా తరచూ మద్యం సేవించి సరోజ ఇంటికి వచ్చి చిన్న చిన్న విషయాలకు గొడవపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

దీంతో విషయం తెలుసుకున్న శ్రీను అనవసరంగా ఇంటికి వచ్చి గొడవ పడుతున్నాడని, మరోసారి వస్తే తగిన బుద్ధిచెబుతామని పలుమార్లు రెడ్యాతో పాటు కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. అయినప్పటికీ రెడ్యా తన ప్రవర్తన మార్చుకోకుండా ఈ నెల 2న రాత్రి మద్యం సేవించి సరోజ ఇంటికి వచ్చి నానా హంగామా చేశాడు. దీంతో విసుగెత్తిన సరోజ, శ్రీనులు బావ రెడ్యాను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో రెడ్యాపై రోటీ కర్రతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇద్దరూ కలిసి అపస్మారక స్థితిలో ఉన్న బావ రెడ్యాను హస్తినాపురంలోని నవీన ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆదివారం మధ్యాహ్నం రెడ్యా మృతి చెందాడు.

ఈ మేరకు పోలీసులు సరోజ, శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారించగా రెడ్యా మద్యం మత్తులో ఇంటికి వచ్చి గొడవపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, వేధింపులు తాళలేకనే దాడి చేసి హత్య చేశామని నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిని సోమవారం రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు