600 మీటర్లు పరుగులు తీసి.. దొంగను పట్టుకుంది

25 Feb, 2021 10:27 IST|Sakshi

బంజారాహిల్స్‌: ఓ యువతి సాహసం పోలీసులచే శభాష్‌ అనిపించుకుంది. సెల్‌ఫోన్‌ దొంగిలించి పరారవుతున్న స్నాచర్‌ను చూస్తూ అందరిలా చేష్టలుడిగి చూడలేదు. దొంగ.. దొంగ.. అని అరుస్తూనే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తూ పారిపోతున్న దొంగను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన భూమిక అనే యువతి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.12లోని ఓ బొటిక్‌లో డిజైనర్‌గా పనిచేస్తున్నది. మంగళవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌లో మెట్రో రైలు ఎక్కేందుకు వెళ్తున్నది. ఫోన్‌ మాట్లాడుకుంటూ రోడ్డుపక్క నుంచి వెళ్తున్న భూమికను వెనుకాల నుంచి అనుసరిస్తున్న ఓ యువకుడు వేగంగా పరుగెత్తుకొచ్చి చేతిలో ఉన్న ఫోన్‌ లాక్కొని పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన భూమిక అరుస్తూ దొంగ వెళ్తున్న వైపు సుమారు 600 మీటర్ల మేర పరుగులు తీసింది.

ఈ క్రమంలో అటువైపు నుంచి వస్తున్న ఓ స్కూటీని ఆపి విషయం చెప్పగా స్కూటీ నడుపుతున్న వ్యక్తి ఆమెను ఎక్కించుకొని దొంగ పారిపోతున్న వైపు పోనిచ్చాడు. శ్రీకృష్ణానగర్‌లోని సింధు టిఫిన్‌ సెంటర్‌ గల్లీలోంచి పారిపోతున్న యువకుడిని ఆ యువతి వెంబడించి కాలర్‌పట్టుకొని లాగింది. చేతిలో ఉన్న తన సెల్‌ఫోన్‌ను లాక్కుంది. అప్పటికే చుట్టుపక్కల వారు గమనించి ఆ యువకుడిని పట్టుకున్నారు. బాధితురాలు 100కి డయల్‌ చేయగా క్షణాల్లోనే జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్రైం పోలీసులు విచారించగా ఈ దొంగ పేరు జె.నవీన్‌ నాయక్‌(20)గా గుర్తించారు. శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటూ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా స్నాచర్‌ను వెంబడించి పట్టుకున్న యువతిని పోలీసులతో పాటు స్థానికులు ప్రశంసించారు.
చదవండి: తోటి విద్యార్థినిపై అనుమానం పెనుభూతమైంది

మరిన్ని వార్తలు