ఫేస్‌బుక్‌ పరిచయం.. నగ్నంగా వీడియో చాట్‌.. కట్‌ చేస్తే..

2 May, 2021 12:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నల్లగొండ: పెళ్లి సంబంధాల పేరిట మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న కిలాడీ లేడీని నల్లగొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్పీ ఏ వీ.రంగనాథ్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేష్‌ తనను బెదిరించి డబ్బులు తీసుకోవడమే కాక సామాజిక మాధ్యమాల ద్వారా తాము షేర్‌ చేసిన తమ ఫొటోలను ఉపయోగించి పెళ్లి సంబంధాల పేరిట ఆడపిల్లల తల్లిదండ్రుల వద్ద సంబంధం కుదిరిస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలి యాస్‌ ఇందు దాసరి అలియాస్‌ ధరణి రెడ్డిపై ఫిర్యాదు చేశాడన్నారు. ఈమేరకు విచారణ చేయగా కి లాడీ లేడీ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడినట్లు వివరించారు.

బొమ్మెల వెంకటేష్‌కు ఇందు దాసరి పేరుతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకొని అతడితో నగ్నంగా వీడియో చాటింగ్‌ చేసి వాటిని వేరే వారికి చూపిస్తానని బెదిరించేదన్నారు. అంతేకాకుండా అతని బంధువు, సోదరుడైన బొమ్మెల అనుదీప్‌ అనే వ్యక్తితో సైతం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకొని వారి ఫొటోలను సేకరించి మూడు నెలలుగా తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్నదని చెప్పారు. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు.

కూకట్‌పల్లిలో మహేశ్వరి అలియాస్‌ మహేశ్వరిరెడ్డి పేరుతో ఆమె, సంతోష్‌ అనే మరో వ్యక్తి కలిసి మణికంఠ అనే వ్యక్తిని ఫేస్‌బుక్‌ ఫేక్‌ ఐడీతో పరిచయం చేసుకొని అతని ఫొటోలు సంపాదించి అతడిని బెదిరించి రూ.4లక్షల50 వేలు వసూలు చేసిందన్నారు. అదేవిధంగా ఘట్‌కేసర్‌ పరిధిలో అబ్బాయి మాదిరిగా ఒక అమ్మాయిని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని తన దగ్గర ఉన్న వేరే వ్యక్తుల ఫొటోలు చూపించి ఆమెను ప్రేమిస్తున్నట్లుగా చెప్పి అనంతరం యువతిని బెదిరించి రూ.లక్షా75 వేలు వసూలు చేసిందన్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు. కేసు విచారణలో ఉన్నట్లు వివరించారు. ఖమ్మం జిల్లా వేంసూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అప్పారావు అనే వ్యక్తి కూతురుకి వివాహ సంబంధం ఉన్నదని, అతడికి జయంత్‌ అనే వ్యక్తి ఫొటోలు చూపించి, వారి నుంచి రూ.7లక్షలు తీసుకున్నదని చెప్పారు. ఇలా మొత్తం రూ.11లక్షల70 వేలు వసూలు చేసిందన్నారు. కాగా.. ఈ కిలాడీ లేడీ నల్లగొండ పట్టణంలోని వన్‌ టౌన్‌ పరిధిలో నివాసం ఉంటున్నట్లుగా గుర్తించి నల్లగొండ వన్‌ టౌన్, మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసినట్లు వివరించారు.

ఈ లేడీపై కూకట్‌పల్లి, ఘట్‌ కేసర్, ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు పోలీస్‌స్టేషన్లతో పాటు కరీంనగర్‌ షీటీమ్, గచ్చిబౌలి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసు విషయంలో తక్కువ వ్యవధిలో వివరాలు సేకరించి సమర్థవంతంగా పని చేసిన మహిళా పొలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ గౌడ్, నల్లగొండ వన్‌ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ నిగిడాల సురేష్‌ను ఎస్పీ అభినందించారు. 

మరిన్ని వార్తలు