చదువుల ఒత్తిడి.. యువ డాక్టర్‌ ఆత్మహత్య

4 Jun, 2021 18:28 IST|Sakshi

ముంబై : డిప్రెషన్‌ కారణంగా ఓ యువ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది. పేరు తెలియని మందును ఎక్కించుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, ఓర్లీకి చెందిన నిటాశా బెంగాలి అనే యువ డాక్టర్‌ గత కొద్దినెలలుగా డిప్రెషన్‌తో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం తన గదిలో పేరు తెలియని మందును ఇంజెక్షన్‌గా తీసుకుంది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆ వెంటనే ఆమె బయటకు వచ్చి విషయాన్ని తల్లికి చెప్పింది. నిటాశాను నాయర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన నిటాశా ఎండీ చదువుతోందని తెలిపారు. చదువుల విషయంలోనే ఆమె ఒత్తిడికి గురవుతున్నట్లు, అందుకోసం చికిత్స కూడా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆమె మరణించటానికి గల స్పష్టమైన కారణం పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే తెలుస్తుందని అన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు