ప్రేమ పేరుతో రూ.11 లక్షలు కాజేశాడు

25 Jun, 2022 13:03 IST|Sakshi
గ్రామంలో విచారణ చేస్తున్న ఎస్‌ఐ సన్నిబాబు

యలమంచిలి రూరల్‌ : పెళ్లి పేరిట మైనర్‌ యువతిని మోసం చేసిన యువకుడిపై యలమంచిలి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక మోసపోయిందని తండ్రి యలమంచిలి రూరల్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సన్నిబాబు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్‌ యవతిని (16)ను కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన బొద్దపు నానాజీ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె నుంచి దశలవారీగా రూ.11 లక్షల కాజేసాడు. ఇంటిలో పెట్టిన డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కూతురిని ప్రశ్నించగా విషయం బయట పడింది.

దీంతో తండ్రి రూరల్‌ పోలీసులను ఆశ్రయించి యలమంచిలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నానాజీతో కలిసి అతని పిన్నమ్మ కరణం వెంకట లక్ష్మి, తల్లి బొద్దపు పాప, చెల్లి లల్లీలు కూడా తమ కుమార్తెను ఏమార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోల్‌ యలమంచిలి రూరల్‌ స్టేషన్‌కు వచ్చి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన సూచన మేరకు పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. మొదట రూ.2 లక్షల వరకు ఫోన్‌ పే ద్వారా.. తర్వాత రూ.6 లక్షలు నేరుగా నగదు రూపంలో ఇచ్చినట్లు, మిగిలిన డబ్బు దశలవారీగా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. నలుగురిపై రూరల్‌ పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.   

(చదవండి: నమ్మించి.. రియల్టర్‌ కిడ్నాప్‌)

మరిన్ని వార్తలు