Rajat Patidar: రజత్‌ పాటిదార్‌ సెంచరీ.. ముగ్గురు మొనగాళ్ల విజృంభణ.. ముంబైకి చుక్కలు!

25 Jun, 2022 13:00 IST|Sakshi
రజత్‌ పాటిదార్‌ అద్భుత సెంచరీ(PC: BCCI Domestic Twitter)

Ranji Trophy Final 2021-2022 Mumbai Vs MP- Rajat Patidar: రంజీ ట్రోఫీ 2021- 2022 సీజన్‌లో భాగంగా ముంబైతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ అదరగొట్టాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో సెంచరీతో మెరిశాడు. భోజన విరామ సమయానికి 195 బంతులు ఎదుర్కొన్న అతడు 120 పరుగులు సాధించాడు. 

అంతకు ముందు ముంబై బ్యాటర్లలో సర్ఫరాజ్‌ ఖాన్‌ 134 పరుగులతో రాణించాడు. ఇక యశస్వి జైశ్వాల్‌ అర్ధ శతకం సాధించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో 374 పరుగుల వద్ద ముంబై తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్‌ జట్టుకు ఓపెనర్‌ యశ్‌ దూబే శుభారంభం అందించాడు. 336 బంతులు ఎదుర్కొన్న అతడు ఎంతో ఓపికగా క్రీజులో నిలబడి 133 పరుగులు చేశాడు.

ముగ్గురు మొనగాళ్లు
ఇక ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన శుభమ్‌ శర్మ 116 పరుగులు చేయగా.. ఆదిత్య శ్రీవాస్తవ 25, అక్షత్‌ రఘువంశి 9, పార్థ్‌ సహాని 11 పరుగులకే పెవిలియన్‌ చేరారు. ఈ నేపథ్యంలో రజత్‌ పాటిదార్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి సరన్‌ జైన్‌ అతడికి తోడుగా క్రీజులో ఉన్నాడు. 

ఈ క్రమంలో యశ్‌ దూబే, శుభమ్‌, రజత్‌ సెంచరీలతో నాలుగో రోజు ఆట భోజన విరామానికి ముందు మధ్యప్రదేశ్‌ 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ముంబైపై 101 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన రజత్‌ పాటిదార్‌.. 7 ఇన్నింగ్స్‌ ఆడి 333 పరుగులు చేశాడు. ప్లే ఆఫ్స్‌ చేరే క్రమంలో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఇక రంజీల్లోనూ అతడు అదరగొడుతున్న నేపథ్యంలో త్వరలోనే రజత్‌కు టీమిండియాలో ఆడే అవకాశం రావాలని.. అతడి బ్లూ జెర్సీలో చూడాలని ఉందంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: India Vs Ireland T20: రాహుల్‌ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు!

మరిన్ని వార్తలు